చేవెళ్ల రూరల్, జనవరి 21 : చేవెళ్ల మండలం ముడిమ్యాల్ గ్రామంలో ప్రత్యేక అధికారి, ఎంఈవో పురందాస్, పంచాయతీ కార్యదర్శి షమీమ్ సుల్తానా ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ సభలో గందరగోళం చోటుచేసుకున్నది. గ్రామస్తులు ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా లబ్ధిదారుల పేర్లు చదివి వినిపించారు. ప్రతి జాబితా తప్పుల తడకగా ఉండడంతో గ్రామస్తులు అధికారులను నిలదీశారు. గ్రామానికి చెందిన యంజాల మల్లేశ్ తాము ఇటీవల ఉపాధి హామీ కింద గ్రామ నర్సరీలో పనులు చేశామని, ఆ డబ్బులు ఇంకా రాలేవని పంచాయతీ కార్యదర్శిని నిలదీశాడు. తాము డబ్బులు వేశామని, బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొస్తే పరిశీలన చేసి, ఒక వేళ డబ్బులు రాని క్రమంలో తిరిగి వేస్తామని కార్యదర్శి సమాధానమిచ్చారు. ఇదివరకే బ్యాంక్ స్టేట్మెంట్లు ఇచ్చానని, అయినా డబ్బులు రాలేదని చెప్పాడు.
ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మధ్యలో చేవెళ్ల ఎస్ఐ సంతోష్ రెడ్డి కలుగజేసుకొని ప్రశ్నిస్తున్న మల్లేశ్‌ను తీసుకెళ్లి లోపల వేసి సాయంత్రం వదిలిపెట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ఘటనకు సంబంధించి వీడియో తీస్తున్న ఓ జర్నలిస్టు ఫోన్ గుంజుకునేందుకు ఎస్ఐ యత్నించాడు. దీంతో గ్రామస్తులందరూ నిలదీయడంతో వెనకి తగ్గాడు. స్థానిక నేతలు కలుగజేసుకొని శాంతింపజేశారు. గ్రామానికి చెందిన మహ్మద్ ఖాజా మొయినుద్దీన్ సైతం గ్రామంలోని చాలా వార్డుల్లో వీధి లైట్లు వెలగడం లేదని, పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా ఉన్నదని పంచాయతీ కార్యదర్శిని అడగడంతో ఎస్ఐ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎకువ మాట్లాడుతున్నవ్.. ప్రివెంటివ్ యాక్షన్ (ముందస్తు చర్య) తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.