రంగారెడ్డి, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలో సంక్షేమ పథకాల లబ్ధిదారుల కోసం కొనసాగుతున్న గ్రామసభలు రెండోరోజూ నిరసనలు, నిలదీతల మధ్య సాగాయి. ప్రారంభంలోనే లబ్ధిదారుల ఎంపిక లిస్టులో తమపేర్లు లేవంటూ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మరోవైపు గ్రామసభల్లో తమ సమస్యల గురించి ప్రస్తావిస్తుండగా, ఎక్కడికక్కడ అడ్డుకుని పోలీసులు తమ గొంతు నొక్కుతున్నారని ప్రజలు వాపోతున్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా బుధవారం జరిగిన గ్రామసభల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి.
యాచారం మండలంలోని ధర్మన్నగూడ గ్రామంలో గ్రామసభ ఆద్యంతం ఉద్రిక్తంగా సాగింది. సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపికకోసం తయారు చేసిన లిస్టులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, అర్హులపేర్లు లేవని, అనర్హుల పేర్లు మాత్రమే జాబితాలో ఉన్నాయని గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందిస్తామని ఓవైపు ప్రభుత్వం చెబుతుండగా.. అధికారులు మాత్రం మరోవైపు అనర్హులను ఎంపిక చేస్తూ లిస్టు తయారు చేశారని, ఇది ఎంత మాత్రం సమంజసం కాదని వాపోతున్నారు.
అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందించాలని, లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో ఎంతోమంది నిరుపేదలుండగా, వారికి కాకుండా రేషన్‌కార్డులు, ఇండ్లు లిస్టుల జాబితాలో అనర్హుల పేర్లు ఉన్నాయని నిలదీశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకోవడంతో వారిని అక్కడి నుంచి తోసివేశారు.
ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో నిర్వహించిన గ్రామసభ కూడా ఆద్యంతం గందరగోళంగా సాగింది. గ్రామసభలో లబ్ధిదారుల పేర్లు చదువుతుండగా.. తమపేర్లు రాలేదంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళన కారులను పంపించేశారు. ఆమనగల్లు మండలంలోని మంగల్‌పల్లిలో సైతం సమస్యలపై ప్రజలు తిరుగుబాటు చేయడంతో అధికారులు వెనుదిరిగారు.
రంగారెడ్డి జిల్లాలో రెండోరోజూ లబ్ధిదారుల ఎంపిక గ్రామసభలు పోలీసుల నిర్బంధం మధ్య కొనసాగాయి. సమస్యలపై ప్రశ్నించే వారిని అక్కడి నుంచి బలవంతంగా పంపించేశారు. గ్రామసభల్లో పోలీసుల జోక్యంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా జరిగిన గ్రామసభల్లో ఎక్కడ చూసినా పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు.
కూలీనాలి చేసుకునేదాన్ని. సొంతిల్లు లేదు. ఇందిరమ్మ ఇల్లు అంటే పేదలకు ఇవ్వరా..? ఇండ్లు ఉన్నోళ్లకే మళ్లీ ఇండ్లు ఇస్తుండ్రు. కాంగ్రెస్ సర్కారు వస్తే మా కష్టాలు తీరుతయనుకున్నం. కానీ బాధలు ఎక్కువవుతున్నయ్. ఇదెక్కడి న్యాయం. ఇల్లు మంజూరు చేయాలి.
– జంతుక అలివేలు, ఆమనగల్లు మున్సిపాలిటీ 5వ వార్డు
ఇంటింటికీ తిరిగి సర్వే చేసిండ్రు. సర్వేలో అర్హులెవరో.. అనర్హులెవరో తెల్వలేదా.. పెంకుటిండ్లు, రేకుల షెడ్లు, గుడిసెలు ఉన్నోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు రావు.. బిల్డింగ్లు ఉన్నోళ్లకే మళ్లీ ఇండ్లు ఇస్తరా.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం. గ్రామ సభలో పేర్లు చదువుతుంటే గుండెలవిసిపోయినయ్. ఎలాంటి ఇల్లు లేకుండా స్థలం ఉన్నవారికీ ఇల్లు మంజూరు కాలేదు. న్యాయం జరిగే వరకు ధర్నా చేస్తాం.
– వస్పుల యాదగిరి, ఆమనగల్లు మున్సిపాలిటీ 5వ వార్డు
నాకు సెంటు భూమి కూడా లేదు. ఇల్లు కూడా కూలిపోయేటట్టున్నది. ఇందిరమ్మ ఇల్లు, అత్మీయ భరోసా పథకాల కోసం దరఖాస్తు చేసుకున్నా. ఏదీ రాలేదు. ఇదెక్కడి న్యాయమని అధికారులను అడిగినా పట్టించుకోలేదు. మళ్లీ దరఖాస్తు చేసుకోమంటున్నరు. కాంగ్రెసోళ్లే కుట్రలు చేసిండ్రని అనుమానం ఉన్నది. ఇది సరైన పద్ధతి కాదు.
– గోరటి జగన్, ఆమనగల్లు మున్సిపాలిటీ 5 వార్డు
నాకు భర్త లేడు. కూలినాలి చేసుకుని బతుకుతున్నా. ఇద్దరు కూతుర్లలో ఒకరికి పెండ్లి చేశా. ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకుని ఎంతో ఆశతో ఉన్నా. కానీ లిస్టులో పేరు రాలేదు. ధనవంతులకే ఇండ్లు వచ్చినయ్, రేషన్ కార్డులు వచ్చినయని చదివిండ్రు. పేదల పేర్లు మాత్రం చదువలేదు. ఇంతటి ఘోరమైన పాలన వస్తదనుకోలే. మాలాంటి దిక్కులేని పేదలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోదా.. ఇదెక్కడి న్యాయం. వితంతువులకు కాంగ్రెస్ సర్కార్ అండగా ఉంటదనుకుని ఓట్లు వేసినం. కానీ ఈ రకంగా మోసం చేస్తదని అనుకోలే. వాళ్లకు మా గోస ముడుతది.
– అట్టికేశ్వరం జంగమ్మ, ఆమనగల్లు మున్సిపాలిటీ, 5వ వార్డు