పరిగి, మార్చి 22 : ప్రతి ఇంట్లో వంటగ్యాస్ వాడకం ఎక్కువగా ఉండగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొన్నేండ్లుగా వంటగ్యాస్ ధరలు పెంచుతూ పోవడం వల్ల పేదవారితోపాటు మధ్యతరగతి ప్రజలపై అధిక భారం పడుతుంది. ఇప్పటివరకు వెయ్యి లోపు ఉన్న వంట గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ.50 పెంచింది. దీంతో వెయ్యి రూపాయలకు పైగా ధరకు సిలిండర్ లభించనున్నది. వికారాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 1,84,466 వంటగ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో రెగ్యులర్ 89260, దీపం కింద 35,193, సీఎస్ఆర్ కింద 21,260, ఉజ్వల కింద 38,753 వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఆయా పట్టణాల్లో మరింత పెరుగనున్నది. మూడేండ్లుగా పరిశీలిస్తే పరిగి పట్టణంలో 2019 మార్చిలో 14.2 కిలోల సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.765.50, 2020 మార్చిలో రూ.870.50, 2021 మార్చిలో రూ.880 ఉండగా మంగళవారం గ్యాస్ సిలిండర్ ధర రూ.1010.50 ఉన్నది. మూడేండ్లలో సబ్సిడీ సిలిండర్ ధర రూ.245 పెరుగడం గమనార్హం. హైదరాబాద్ నుంచి దూరంగా ఉండే తాండూరులో గ్యాస్ సిలిండర్ ధర రూ.1018 పైగానే ఉంటుంది. రవాణా ఖర్చు పెరుగుతున్న కొలది వంటగ్యాస్ ధర సైతం మరింత పెరుగుతున్నది.
రోజురోజుకూ సబ్సిడీ వంటగ్యాస్ ధర పెరుగుతుండడంతో వినియోగదారులకు వచ్చే సబ్సిడీ తగ్గిపోతుంది. రాబోయే రోజుల్లో వంటగ్యాస్‌పై సబ్సిడీని పూర్తిగా ఎత్తివేసే కుట్రలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ధరలను తరచుగా పెంచుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రతి ఇంట్లో వంటగ్యాస్ కనెక్షన్ ఉన్నది. వంట గ్యాస్ వినియోగం పెద్ద ఎత్తును పెరుగగా కేంద్రం వంటగ్యాస్ ధరలు పెంచుతూ పోవడం ద్వారా సామాన్యులపై మోయలేని భారం పడుతుందని చెప్పవచ్చు. పరిస్థితి ఇలాగే కొనసాగి ధరలు పెరిగితే గ్రామాల్లో మళ్లీ కట్టెల పొయ్యి దిక్కు అని పలువురు పేర్కొంటున్నారు. సాధారణంగా అయిదారు మంది ఉండే ఇంట్లో 14.2 కిలోల వంట గ్యాస్ నెల రోజులకు సరిపడుతుంది. ఈ లెక్కన సరాసరిగా నెలకు వంటగ్యాస్పైనే వెయ్యి రూపాయలకుపైగా ఖర్చు చేయాల్సి రావడం ఇబ్బందికరంగా మారనున్నది. వంటగ్యాస్‌కే ఈ స్థాయిలో డబ్బులు వెచ్చిస్తే ఇతర నిత్యావసర వస్తువులకు ఖర్చులు పెరిగి తడిసి మోపెడవుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. ఏదిఏమైనా వంట గ్యాస్ ధరల పెంపు సామాన్యులకు గుదిబండగా మారుతుందని చెప్పవచ్చు.
ఎనిమిదేండ్ల కాలంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిత్యావసర ధరలతో పాటు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ఇష్టానుసారంగా పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తుంది. ఎనిమిదేండ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంచింది. అదే విధంగా గ్యాస్ సిలిండర్ ధరలు కూడా అదే స్థాయిలో పెరుగడంతో ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ ధర రూ. 960 వరకు ఉండగా, తాజాగా మరొ రూ. 50 పెంచడంతో రూ. 1000 దాటింది. దీంతో సామాన్యులు గ్యాస్ కొనుగోలు చేసే పరిస్థితుల్లో లేరు. లీటర్ పెట్రోల్‌పై 90పైసలు పెంచడంతో రూ. 109కి చేరింది. అదే విధంగా డీజిల్‌పై 87పైసలు పెంచడంతో రూ. 95.49కి చేరుకుంది. ఇష్టానుసారంగా పెంచుతున్న ధరలతో సామాన్య ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వం తీరు సరైందికాదని రంగారెడ్డిజిల్లా ప్రజలు మండిపడుతున్నారు.
సామాన్యుడి అవస్థలు..
రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలు అవస్థలు పడుతున్నారు. గతంలో ఎప్పుడూలేని విధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వంటగ్యాస్‌తో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతంగా పెంచుకుంటూ వస్తుంది. ద్విచక్ర వాహనదారుడు తన వాహనంలో వంద రూపాయల పెట్రోల్ పోయిస్తే ఒక లీటర్ కూడా వస్తలేదని వాపోతున్నారు. కేంద్రం ప్రతి సారి వంటగ్యాస్ ధర రూ. 50నుంచి రూ. 100వరకు పెంచుకుంటూ పోతుండడంతో నేడు సిలిండర్ ధర రూ. 1000దాటింది. దీంతో మళ్లీ కట్టెల పోయ్యే దిక్కయ్యేటట్లుందని మహిళలు వాపోతున్నారు. వీటితో పాటు నిత్యావసర సరుకులు నూనె, పప్పుల ధరలు కూడా అందనంత ఎత్తుకు పెరిగిపోవడంతో సామాన్యుడిపై పెనుభారం తప్పడం లేదు. కేంద్రం పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని జనాలు డిమాండ్ చేస్తున్నారు.
సామాన్యులను ఇబ్బందులు పెడుతున్న కేంద్రం
కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచి సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తుంది. ఎనిమిదేండ్ల కాలంలో పలుమార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన బీజేపీ వినియోగదారులపై పెనుభారం మోపుతుంది. ధరలు అదుపు చేయకుంటే పేదవాళ్లకు అవస్థలు తప్పేట్లు లేవు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి.
– నక్క శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ షాబాద్
బతుకడం కష్టంగా మారింది
కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. నూనెల నుంచి నిత్యావసర వస్తువుల వరకూ ధరలు విపరీతంగా పెరిగాయి. ఇప్పుడు కేంద్రం ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.50కి పెంచడంతో పేదలకు ఆర్థికంగా భారం కానుంది. కట్టెల పొయ్యిల స్థానంలో కేంద్ర ప్రభుత్వం మహిళలకు ఎల్పీజీ సిలిండర్లను అందించి ప్రోత్సహించింది. ఇప్పుడేమో ధరలను పెంచి భారం మోపుతుంది.
-నీలిమ, గృహిణి,గాజులకుంటతండా, బొంరాస్‌పేట మండలం
కేంద్రం నిర్ణయం సరికాదు
కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ధర పెంచుతూ తీసుకున్న నిర్ణయం సరికాదు. గతంలో కట్టెల పొయ్యిమీద వంట చేసే మహిళలంతా నేడు సిలిండర్ ద్వారా వంట చేస్తున్నారు. రూ. 400 ఉన్న వంటగ్యాస్ ధర బీజేపీ ప్రభుత్వం వచ్చినంక నేడు రూ. వెయ్యి దాటడం దారుణంగా ఉంది.
– పూజిత, సర్పంచ్ అప్పారెడ్డిగూడ(షాబాద్)