పరిగి/షాబాద్, నవంబర్ 19 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏడాది క్రితం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించడంపై రైతాంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు నష్టం కలిగించేలా ఈ చట్టాలు ఉన్నాయని ఏడాది కాలంగా రైతాంగం, ప్రజా సంఘాలు, వివిధ పార్టీలు పెద్దఎత్తున ఆందోళనలు చేయగా, వాటి ఫలితమే కేంద్రం ఈ చట్టాల రద్దు నిర్ణయానికి వచ్చిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని రైతులు ఆందోళనకు దిగిన మొదట్లో తీసుకొని ఉంటే అనేక మంది రైతులు చనిపోయేవారు కాదని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ రెండు రోజుల క్రితం ఇందిరా పార్కు వద్ద మహా ధర్నా చేపట్టింది. దేశంలోని రైతాంగానికి నాయకత్వం వహిస్తూ రైతు వ్యతిరేక చట్టాల రద్దు డిమాండ్‌తో ఉద్యమాలు చేపడుతామని మహాధర్నా సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. పార్లమెంట్‌లోనూ టీఆర్ఎస్ ఎంపీలు నిరసన గళం విప్పారు. ఈ నేపథ్యంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను వాపస్ తీసుకుంటామని ప్రకటించడం గమనార్హం. ఇది టీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయమంటున్నారు అన్నదాతలు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర లభించేలా కేంద్రం చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చట్టాలు రద్దు చేయడంపై పరిగి బస్టాండ్ వద్ద సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.వెంకటయ్య ఆధ్వర్యంలో నాయకులు పటాకులు కాల్చారు.
ముమ్మాటికి ఇది రైతుల ఘన విజయం – వంగేటి లక్ష్మారెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలతో పూర్తిగా నష్టాలేనని గత ఏడాది నుంచి రైతులు చేసిన దీక్షకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రద్దుచేసింది. ఈ ఘనత కేవలం రైతుల ఘన విజయం. కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్న బీజేపీ ప్రభుత్వం దేశంలో రైతులను కూడా తాకట్టు పెట్టేందుకు ఈ చట్టాలను తీసుకువచ్చింది. వీటికి వ్యతిరేకంగా పోరాడిన రైతుల కష్టానికి నేడు ప్రతిఫలం దక్కడం ఆనందదాయకం.
మహా ధర్నా కేంద్రంపై ఒత్తిడి పెంచింది – స్వప్న, టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా మహిళా కమిటీ అధ్యక్షులు, మొయినాబాద్
రైతులు చేపట్టిన ఆందోళనలు కేంద్ర ప్రభుత్వంతో చట్టాలను రద్దు చేయించాయి. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం మహా ధర్నా చేపట్టడంతో కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుపై కదలిక వచ్చింది. ఏడాది నుంచి రైతులు వినూత్న పద్ధతిలో అకుంఠిత దీక్షతో ఆందోళన చేపట్టారు. కేంద్రం రైతు చట్టాలను రద్దు చేస్తామని చెప్పడం ఇది ముమ్మాటికి రైతుల విజయమే.
రైతుల పోరాటంతో దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం : జిల్లెల వెంకట్‌రెడ్డి, సర్పంచ్, నందిగామ
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన రైతు చట్టాలను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా రైతులు చేస్తున్న ఆందోళనలతో ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రైతు చట్టాలను రద్దు చేసింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకుని రైతులకు మేలు చేయాలి.
రైతు చట్టాలు రద్దు చేయడం హర్షణీయం : సంజయ్ దత్తు, రైతు, ఎన్కతల, మోమిన్‌పేట
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 కొత్తసాగు చట్టాలను వెనక్కి తీసుకోవడం హర్షించదగ్గ విషయం. కొత్త సాగు చట్టాలు ప్రకటించిన నాటి నుంచి దేశవ్యాప్తంగా రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. రైతుల ఆగ్రహానికి తట్టుకోలేక కేంద్రం తలొగ్గడం ఇది దేశ రైతుల విజయం.
రైతుల పోరాట ఫలితమే వ్యవసాయ చట్టాల రద్దు – ఏర్పుల నర్సింహులు, రైతు, రాఘవాపూర్, పరిగి
రైతుల పోరాట ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక మూడు చట్టాలను రద్దు చేసింది. సంవత్సరం నుంచి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేసినా కేంద్రం పెడచెవిన పెట్టింది. సీఎం కేసీఆర్ రైతులతో కలిసి ధర్నాకు దిగడం వల్లే కేంద్రం తలొగ్గింది. రైతుల శ్రేయస్సు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది.