బొంరాస్‌పేట, జూలై 16 : మండలంలోని తుంకిమెట్లలో ప్రతి ఆదివారం జరిగే వారాంతపు సంత కష్టాలు ఇక తీరనున్నాయి. ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి కృషితో మార్కెట్ షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.21 లక్షలు మంజూరు చేసింది. వీటిలో రూ.14 లక్షలు జాతీయ ఉపాధిహామీ పథకంలో మంజూరుకాగా మిగిలిన రూ.7లక్షలు గ్రామపంచాయతీ నిధుల నుంచి ఖర్చు చేయనున్నారు. ప్రతి ఆదివారం జరిగే వారంతపు సంతలో భాగంగా హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారితోపాటు కోస్గి రోడ్డుకు ఇరువైపులా కూరగాయల వ్యాపారులు, ఇతర వ్యాపారులు దుకాణాలను ఏర్పాటు చేసుకుని క్రయవిక్రయాలు కొనసాగిస్తున్నారు. దీనివల్ల వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారులకు సరైన సౌకర్యాలు ఉండడంలేదు. వర్షాకాలం వస్తే కొనుగోలుదారులు, వ్యాపారులు అవస్థలు పడుతున్నారు. అంగడి జరిగే స్థలాన్ని వేరే చోటుకు మార్చాలని వ్యాపారులు, ప్రజలు చాలాకాలంగా కోరుతున్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మార్కెట్ షెడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా రూ.21 లక్షలు మంజూరయ్యాయి.
600 గజాల స్థలంలో 15 దుకాణాలు
షెడ్ల నిర్మాణానికి 600 గజాల స్థలం అవసరమవుతుంది. మంజూరైన రూ.21 లక్షల నిధులతో 15 దుకాణాలు, పారిశుధ్య లోపం తలెత్తకుండా నాలుగు టాయిలెట్లు, నీటి వసతి, వాహనాలను పార్కింగ్ చేయడానికి స్థలాన్ని వదులుతారు. షెడ్ల చుట్టూ ప్రహరీ నిర్మిస్తారు. షెడ్ల నిర్మాణానికి గ్రామంలో రైతు వేదిక సమీపంలో ఉన్న స్థలాన్ని ఎంపిక చేశారు. త్వరలో పనులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. షెడ్ల నిర్మాణం పూర్తయితే జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం తొలగిపోతుంది. వర్షం వచ్చినా వ్యాపారులు, కొనుగోలుదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. షెడ్ల నిర్మాణానికి నిధులు మంజూరుకావడంపై ప్రజలు, వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు: స్వరూప, తుంకిమెట్ల సర్పంచ్
తుంకిమెట్ల గ్రామంలో మార్కెట్ షెడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి కృతజ్ఞతలు. ప్రతి ఆదివారం రోడ్డుకు ఇరువైపులా దుకాణాలు ఏర్పాటు చేసుకుని వ్యాపారులు అమ్మకాలు జరుపుతున్నారు. దీంతో రోడ్డు ఇరుకుగా మారి వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో ఐతే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. షెడ్ల నిర్మాణం జరిగితే ఇప్పుడున్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. షెడ్ల నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని కూడా ఎంపిక చేశాం.