పరిగి, ఆగస్టు 29 : పరిశుభ్రతతో సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండవచ్చని పరిగి మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ దశరథ్ పేర్కొన్నారు. డ్రై డే ఫ్రై డే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పరిగి మున్సిపాలిటీ పరిధిలోని న్యామత్నగర్, 4వ వార్డులో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంతోపాటు మురికినీరు నిలువకుండా చూసుకోవాలన్నారు. పాత సామగ్రిలో వర్షపు నీరు నిలువ ఉంటే దోమలు ఆవాసం ఏర్పరచుకునే అవకాశం ఉంటుందని, ఎప్పటికప్పుడు నీరు పారబోయాలని చెప్పారు. తడి, పొడి చెత్తను వేర్వేరు చేసి చెత్త సేకరణ వాహనాల్లో వేయాల్సిందిగా ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్పర్సన్లు, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ తదితరులు పాల్గొన్నారు.