వికారాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. ఎనిమిదేండ్ల కాలంలో జిల్లాలోని రోడ్ల అభివృద్ధి కోసం దాదాపుగా రూ.వెయ్యి కోట్ల కు పైగానే నిధులను విడుదల చేసింది. గత ఉమ్మ డి ప్రభుత్వాల పాలనలో జిల్లాలు, మండల కేంద్రాల్లోని రోడ్లు అధ్వానంగా ఉండేవి. వర్షాకాలం వచ్చిందంటే చాలా ప్రజలు మట్టి రోడ్లతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యే వారు. అయితే తెలంగాణ ఏర్పడి కేసీఆర్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలోని రోడ్లకు మహర్దశ వచ్చింది. అదేవిధంగా వికారాబాద్ జిల్లాలోని రోడ్లు కూడా బాగుపడ్డాయి. జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకు.. మండల కేం ద్రాల నుంచి గ్రామపంచాయతీలకు రోడ్లను ఏర్పా టు చేశారు. పంచాయతీల్లోనూ అంతర్గత రోడ్ల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం జిల్లాలోని అన్ని గ్రామాల్లోనూ రోడ్లను ఏర్పాటు చేశా రు. అయితే జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులతోపాటు కొత్త రోడ్ల ఏర్పాటుకోసం జిల్లా పంచాయతీరాజ్, రోడ్లు, భవనాలశాఖ అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి అందించగా త్వరలోనే నిధులు మంజూరు కానున్నాయి. నిధులొచ్చిన వెంటనే పనులను చేపట్టేందుకు సంబంధిత శాఖల అధికారులు సిద్ధంగా ఉన్నారు.
రూ.98 కోట్లతో కొత్త రోడ్లకు..
జిల్లాలో కొత్తగా పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణానికి రూ.98 కోట్ల నిధులు అవసరం అవుతాయని అధికారులు ప్రతిపాదనలు పంపారు. అయితే కొత్త రోడ్ల ప్రతిపాదనల్లో మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యతగా అంచనాలను సిద్ధం చేసి పం పించారు. మొదటి ప్రాధాన్యత కింద జిల్లావ్యాప్తం గా 64 కిలోమీటర్ల మేర 30 పనులకు రూ.56.16 కోట్లు అవసరమని, రెండో ప్రాధాన్యత కింద 27 పనులకుగాను 54.76 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి రూ.47.17 కోట్ల నిధులు అవసరమని అంచనాలను రూపొందించారు.
రూ.210 కోట్లతో ప్రతిపాదనలు..
జిల్లాలోని పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్ల అభివృద్ధికి రూ.210 కోట్లు అవసరమని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపారు. ఆ నిధులతో బీటీ, కొత్త రోడ్ల నిర్మాణంతోపాటు జిల్లాలో 61.30 కిలోమీటర్ల మేర రోడ్లు అధిక వర్షాలతో దెబ్బతిన్నట్లు గుర్తించి మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్, చేవెళ్ల నియోజకవర్గాల్లోని 16 రోడ్లలో 61.30 కిలోమీటర్ల మేర రూ.29.60 కోట్లతో ఆర్అండ్బీ రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని ప్రతిపాదించారు. వీటిలో వికారాబాద్ నియోజకవర్గంలోని ఏడు రోడ్లలో 23 కిలోమీటర్ల మేర మరమ్మతులు చేపట్టేందుకు రూ. 6కోట్లు అవసరమని, పరిగి నియోజకవర్గంలోని నాలుగు రోడ్లలో 16 కిలోమీటర్ల మేర బాగు చేసేందుకు రూ.6 కోట్లు, తాండూరు నియోజకవర్గంలోని రెండు రోడ్లలో 6.50 కిలోమీటర్ల మేర మరమ్మతులకు రూ.6 కోట్లు, కొడంగల్ నియోజకవర్గంలోని రెండు రోడ్లలో 5.30 కిలోమీటర్లకుగాను రూ.5.60 కోట్లు, చేవెళ్ల నియోజకవర్గంలోని ఒక రోడ్డులో 10 కిలోమీటర్ల మేర మరమ్మతులకు రూ.6 కోట్లు అవసరమని జిల్లా రోడ్లు, భవనాల శాఖ అధికారులు ప్రతిపాదనలను తయారు చేసి ప్రభుత్వానికి అందజేశారు.
అదేవిధంగా పంచాయతీరాజ్ రోడ్లకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 229 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని అధికారులు ప్రతిపాదించారు. 82 పనులకుగాను రూ.82.26 కోట్ల నిధులు అవసరం అవుతాయని అంచనా వేశారు. వికారాబాద్ నియోజకవర్గంలోని 60.70 కిలోమీటర్ల మేర 24 పనులకు రూ.28.19కోట్లు, చేవెళ్లలోని 5.30 కిలోమీటర్ల మేర ఒక రోడ్డు కు రూ.2.50 కోట్లు, తాండూరులోని 44.73 కిలోమీటర్ల మేర 23పనులకు రూ.11.41 కోట్లు, పరిగిలోని 93.55 కిలోమీటర్ల మేర 29 పనులకు రూ. 31.83 కోట్లు, కొడంగల్ నియోజకవర్గంలోని 25.70 కిలోమీటర్ల మేర 5 బీ టీ రోడ్ల మరమ్మతులకు రూ.10.33 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు.
ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందజేశాం
జిల్లాలో రోడ్ల అభివృద్ధి, మరమ్మతుల కోసం నిధులు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలను అందజేశాం. జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో అన్ని నియోజకవర్గాల్లోనూ రోడ్లు దెబ్బతిన్నాయి. జిల్లావ్యాప్తంగా 61.30 కిలోమీటర్ల మేర ఆర్అండ్బీ రోడ్ల మరమ్మతులకు అంచనాలను రూపొందించి అందించాం. నిధులు విడుదలైన వెంటనే పనులను ప్రారంభిస్తాం.
– లాల్సింగ్, ఆర్అండ్బీ ఈఈ, వికారాబాద్ జిల్లా