మర్పల్లి, జులై 13 : వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలోని నర్సాపూర్ గ్రామంలో గ్రామస్తులు మద్యపానం నిషేధిస్తున్నట్లు ఆదివారం తీర్మానం చేశారు. గ్రామస్తులు అందరూ సమావేశమై గ్రామంలో బెల్ట్ షాపులు నడుపరాదని గ్రామ పెద్దల సమక్షంలో తీర్మానం చేశారు. బెల్ట్ షాపుల ద్వారా గ్రామంలో యువత తాగుడుకు బానిసలై జీవితాలు నాశనం అవుతున్నాయని, ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా తీర్మాన పత్రాన్ని మర్పల్లి పోలీస్ స్టేషన్లో ఎస్సై గఫార్కు అందజేశారు. గ్రామంలో ఎవరూ మద్యం విక్రయించకూడదని, ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో శ్రీనివాస్, పవన్ కుమార్, రమేశ్, అరవింద్, శాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.