పరిగి, ఆగస్టు 15 : భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.30వేలు పరిహారం అందించాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పత్తి, మొక్కజొన్న పంటలు నష్టపోయిన పరిగి మండలం పోల్కంపల్లి గ్రామ శివారులోని పంట పొలాలను శుక్రవారం మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పరిశీలించారు. బురదమయంగా ఉన్న ప్రాంతానికి స్వయంగా ఆయన ట్రాక్టర్ నడిపించి మరీ వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి పెట్టుబడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒక్కో ఎకరానికి సుమారు రూ.30వేల నుంచి 40వేల రూపాయలు పెట్టుబడిగా పెట్టామని రైతులు తెలిపారు. భారీ వర్షంతో ఒక్కరోజులోనే పంట పూర్తిగా దెబ్బతిందని, పంట కొట్టుకుపోయిందని చెప్పారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆరుగాలం కష్టపడితేకానీ చేతికి అందని పంట, కళ్లముందే వర్షానికి దెబ్బతినడంతో పెట్టుబడులు అందే పరిస్థితి లేదన్నారు. కేవలం పోల్కంపల్లిలోనే సుమారు 150 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పంటలకు నష్టం వాటిల్లిందని చెప్పారు. పంటలు నష్టపోయిన రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉన్నారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. భారీ వర్షాలతో పరిగి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో జరిగిన పంట నష్టం వివరాలను వ్యవసాయాధికారులు సేకరించి ప్రభుత్వానికి పంపించాలని సూచించారు. ఈ మేరకు వ్యవసాయాధికారికి ఫోన్ చేసిన మాజీ ఎమ్మెల్యే పంట నష్టపోయిన వారి వివరాలు, పంటల విస్తీర్ణంపై వివరాలు సేకరించి ప్రభుత్వానికి పంపించాలని చెప్పారు.