Thyroid Problems | థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు ఎలాంటి ఆహారాలను తీసుకోవాలి.. వేటిని మానేయాలి..?
శరీరంలోని జీవక్రియలను నియంత్రించే ముఖ్యమైన ఎండోక్రైన్ గ్రంథుల్లో థైరాయిడ్ ఒకటి. ఈ గ్రంథి సక్రమంగా పనిచేయకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దేశంలో థైరాయిడ్ సంబంధిత సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే థైరాయిడ్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సరైన ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది.
Thyroid Problems | శరీరంలోని జీవక్రియలను నియంత్రించే ముఖ్యమైన ఎండోక్రైన్ గ్రంథుల్లో థైరాయిడ్ ఒకటి. ఈ గ్రంథి సక్రమంగా పనిచేయకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దేశంలో థైరాయిడ్ సంబంధిత సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే థైరాయిడ్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సరైన ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన వ్యాధులు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. థైరాయిడ్ హార్మోన్లు తక్కువగా ఉత్పత్తి కావడం వల్ల హైపోథైరాయిడిజం వస్తుంది. ఇది మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మరోవైపు, థైరాయిడ్ హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అయితే హైపర్ థైరాయిడిజం ఏర్పడుతుంది. ఈ రెండు పరిస్థితులపై కూడా ఆహారపు అలవాట్లు గణనీయమైన ప్రభావం చూపుతాయి.
మెడిటరేనియన్ డైట్ అయితే బెటర్..
హైపోథైరాయిడిజం ఉన్నవారు మెడిటరేనియన్ డైట్‌ను అనుసరించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆహార విధానంలో పండ్లు, కూరగాయలు, బ్రౌన్ రైస్, ఓట్స్, బార్లీ, సంపూర్ణ గోధుమలు, గింజలు, నట్స్, ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు, అలాగే బీన్స్, చేపలు, కోడి మాంసం, పెరుగు, చీజ్ వంటి ప్రోటీన్ ఆహారాలు ఉంటాయి. ఈ డైట్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు థైరాయిడ్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే ప్రాసెస్ చేయని సహజ ఆహారాలతో కూడిన పాలియో డైట్ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే బ్రోకోలీ, కాలీఫ్లవర్, ముల్లంగి, క్యాబేజీ వంటి క్రూసిఫెరస్ కూరగాయలను పచ్చిగా ఎక్కువగా తినడం వల్ల థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
అయోడిన్ ముఖ్యపాత్ర..
థైరాయిడ్ హార్మోన్ల తయారీలో అయోడిన్ కీలకమైన పాత్ర పోషిస్తుంది. అయోడిన్ లోపం హైపోథైరాయిడిజానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా భావిస్తారు. అయోడైజ్డ్ ఉప్పు వాడని వారు, పూర్తిగా వెగన్ ఆహారం తీసుకునేవారు, గర్భిణులు అయోడిన్ లోపానికి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంటుంది. సముద్రపు శైవలాలు, సముద్ర ఆహారం, పాల ఉత్పత్తులు, గుడ్లు కూడా అయోడిన్‌కు మంచి వనరులు. అయితే హషిమోటో థైరాయిడిటిస్ వంటి ఆటోఇమ్యూన్ థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు అధికంగా అయోడిన్ తీసుకోవడం వల్ల సమస్యలు పెరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్త అవసరం. సెలీనియం అనే ఖనిజం థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి తోడ్పడటంతో పాటు గ్రంథిని ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి రక్షిస్తుంది. ట్యూనా చేప, గుడ్లు, బ్రెజిల్ నట్స్, పప్పుధాన్యాలు, సార్డిన్ చేపలు, ఓట్స్ వంటి ఆహారాల్లో సెలీనియం లభిస్తుంది. అయితే అధికంగా సెలీనియం తీసుకోవడం వల్ల విషపూరిత ప్రభావాలు కలిగే ప్రమాదం ఉంటుంది.
జింక్ లోపం ఉంటే..
జింక్ లోపం కూడా థైరాయిడ్ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. గుమ్మడికాయ గింజలు, ఆయిస్టర్లు, నట్స్, పప్పుధాన్యాలు జింక్‌కు మంచి వనరులు. అయితే వైద్యుల సలహా లేకుండా అధిక మోతాదులో జింక్ తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం ఉంటుంది. విటమిన్ డి, విటమిన్ బి12, ఐరన్, మెగ్నీషియం లోపాలు కూడా హైపోథైరాయిడిజం ప్రమాదాన్ని పెంచుతాయి. సూర్యరశ్మి, కొవ్వు అధికంగా ఉండే చేపలు, గుడ్డు పచ్చసొన, పాల ఉత్పత్తులు విటమిన్ డికి మంచి వనరులు. విటమిన్ బి12 ప్రధానంగా జంతు ఆధారిత ఆహారాల్లో లభిస్తుంది. గుమ్మడికాయ గింజలు, అవిసె గింజలు, చియా గింజలు, బాదం, జీడిపప్పు, ఆకుకూరలు, అరటిపండ్లు, పెరుగు వంటి ఆహారాల్లో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. పాలకూర, ఫోర్టిఫైడ్ సిరియల్స్, సముద్ర ఆహారం, శనగలు, టోఫూ వంటి ఆహారాల్లో ఐరన్ లభిస్తుంది. ఐరన్ అధికంగా ఉన్న ఆహారాలతోపాటు నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లు తీసుకుంటే శరీరం ఐరన్‌ను మరింత సమర్థంగా గ్రహిస్తుంది.
థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు ముఖ్యంగా అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాలను తగ్గించడం మంచిది. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్ను పెంచే అవకాశం ఉంది. హైపర్ థైరాయిడిజం ఉన్నవారు అధిక అయోడిన్, కెఫిన్, సోయా ఉత్పత్తులు, గ్లూటెన్ ఎక్కువగా ఉండే ఆహారాలను పరిమితం చేయాలి. సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, ఒత్తిడిని తగ్గించే పద్ధతులు, తగినంత నిద్ర, ఆరోగ్య పరీక్షలు, అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండటం ద్వారా థైరాయిడ్ ఆరోగ్యాన్ని మెరుగ్గా కాపాడుకోవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో అసలు కథ ఏంటో చెప్పనున్న టీమ్!
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
IMAX IN Hyderabad | సినిమా లవర్స్‌కు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో మరో సరికొత్త ఐమ్యాక్స్!
Ramayana | ‘రామాయణ’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపిన రణ్‌బీర్ కపూర్.. ఒక్కరోజులోనే రూ.5.35 కోట్ల వసూళ్లు!
Election Break | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

