దోమ : అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్న పరిగి మండల తహసీల్దార్ ఆనందరావును వెంటనే సస్పెండ్ చేయాలని దోమ మండల కార్మిక సంఘం నాయకులు సోమవారం దోమ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రంగంపల్లి గోవిందపురం గ్రామాలలోని ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్న తహసీల్దార్‌పై పూర్తి విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
రంగంపల్లి గ్రామంలో సర్వేనెంబర్ 256లో 20 ఎకరాల 23 గుంటల ప్రభుత్వ భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేయగా, గోవిందపురం గ్రామంలోని సర్వేనెంబర్ 95లో 16 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇతరులకు అక్రమ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడని వారు ఆరోపించారు. ప్రభుత్వ భూములను అమ్మడం కొనడం చట్టరీత్యా నేరమని తెలిసిన సంబంధిత అధికారులే నిబంధనలను తుంగలో తొక్కి అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల ఐక్యవేదిక దోమ మండల నాయకులు హరిజన సత్తయ్య, చెన్నారెడ్డి, వెంకటేష్, సీహెచ్ సత్తయ్య, రాములు, ఆనంద్ రాజు తదితరులు పాల్గొన్నారు.