వికారాబాద్, నవంబర్ 26 : వికారాబాద్ జిల్లాలో జరిగే స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు బాధ్యత తో పని చేయాలని, వారికి సంబంధించిన అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 25 న విడుదలైందని, అప్పటి నుండి డిసెంబర్ 17 వరకు ఎన్నికల కోడ్ , నిబంధనలు అమల్లోకి వచ్చినందున ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందన్నారు. జిల్లా లో మూడు విడతలలో ఎన్నికలు జరుగనున్నాయని, మొదటి విడత లో 8 మండలాలలో 262 గ్రామ పంచాయతీలు, 2198 వార్డులు ,2198 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు.
నామినేషన్లు మొదలు పెట్టాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను తొలగిస్తూ గెజిట్ జారీ అయిందన్నారు. అధికారులకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) నిబంధనలు, ఫ్లయింగ్ స్క్వాడ్, సర్విలేయన్స్ టీంల ఏర్పాటు చెయడం జరిగిందని తెలియజేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రతి ఒక్కరికి సమానంగా వర్తిస్తుందని సూచించారు. నామినేషన్లు ఉదయం 10.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు తీసుకోవాలని, ఎక్కడ ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా స్థానిక పోలీస్ సిబ్బందితో సమన్వయ పరుచుకొని సజావుగా జరిగేలా చూడాలన్నారు.
పౌరులు ఎవరైనా ఎన్నికలపై తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి 8416235291 హెల్ప్ లైన్ 24/7 అందు బాటులో ఉంటుందని తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో 08416235291 కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ స్నేహా మోహ్రా, అడిషనల్ కలెక్టర్లు లింగ్యానాయక్, సుదీర్, ట్రైని కలెక్టర్ హర్ష్ చౌదరి, ఆర్డీవో వాసుచంద్ర, డీపీవో జయసుధ, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.