కుత్బుల్లాపూర్,ఫిబ్రవరి17: మున్సిపల్ అధికారి ఏసీబీకి చిక్కాడు. రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ జోన్ చింతల్ సర్కిల్ పరిధి భగత్‌సింగ్‌నగర్ నివాసి నాలుగైదేండ్ల క్రితం ఇల్లు కొనుగోలు చేశాడు. ఇంటికి ఆస్తిపన్ను అసెస్మెంట్, పాత యజమాని పేరు మీద ఉన్న ప్రాపర్టీని తన పేరుమీదకు మార్చుకోవడానికి మ్యుటేషన్ దరఖాస్తు చేసుకున్నాడు. చింతల్ సర్కిల్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్, ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న వహీద్‌ను సంప్రదించగా రూ.2.70 లక్షల పన్ను చెల్లించాల్సి ఉంటుందని నోటీసు ఇవ్వడంతో బాధితుడు కంగు తిన్నాడు.
రికార్డుల్లో పేరు మార్పిడి ప్రక్రియను పూర్తి చేయడానికి బాధితుడి వద్ద రూ. లక్ష డిమాండ్ చేశాడు. బాధితుడు అంత ఇచ్చుకోలేనని ప్రాధేయపడడంతో ఒప్పందం ప్రకారం రూ.90 వేలకు బేరం కుదిరింది. ముందస్తుగా బాధితుడు రూ.10 వేలు ఇచ్చాడు. మిగిలిన మొత్తాన్ని ఇవ్వడం ఇష్టం లేక బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు సదరు అధికారిని విచారిస్తున్నారు.