వికారాబాద్, డిసెంబర్ 19: డిసెంబర్ 23న ’మీ డబ్బు మీ హక్కు’ ప్రత్యేక శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్లెయిమ్ చేసుకొని ఆర్థికపరమైన ఆస్తులను ప్రజలు తిరిగి పొందేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మీ డబ్బు మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ఈనెల 23న కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ శిబిరం కొనసాగనుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా సంవత్సరాల తరబడి క్లెయిమ్ చేయని బ్యాంకు డిపాజిట్లు, షేర్లు, డివిడెంట్లు, మ్యూచువల్ ఫండ్స్, బీమా పాలసీలు తదితర ఆస్తులను వాస్తవ యజమానులు సులువుగా పొందేందుకు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజల సొమ్ము యాజమానులకు వెళ్లాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఈ కార్యక్రమం నిదర్శనమని పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తమ ఆస్తులు తనిఖీ చేసుకుని, తగిన పత్రాలతో కలెక్టరేట్ లో నిర్వహించే శిభిరంలో పాల్గొనాలని సూచించారు.