దోమ, మే 28 : రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా ధాన్యం కొనుగోలు జరపాలని వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్ అన్నారు. దోమ మండల పరిధిలోని ఐనాపూర్ గ్రామంలో బుధవారం రైతులు మొలకెత్తిన ధాన్యాలతో రోడ్డెక్కిన సందర్భంగా స్పందించిన అడిషనల్ కలెక్టర్ గురువారం అయినాపూర్ ఐకెపి కొనుగోలు సెంటర్ను సందర్శించి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చివరి గింజ వరకు రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకుంటామని రైతులకు భరోసా కల్పించారు.
మ్యాచర్ ఎక్కువగా వచ్చిన ధాన్యాన్ని సైతం రైతులతో మాట్లాడి మిల్లులకు పంపే విధంగా చర్యలు చేపట్టాలని ఐకెపి సెంటర్ నిర్వాహకులకు ఆయన సూచించారు. వర్షాల కారణంగా తడిసిన వరి ధాన్యాన్ని మొదటి ప్రాధాన్యం కింద కొనుగోలు చేసి మిల్లులకు పంపే ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ నరసింహులు, ఆర్ఐ సుదర్శన్, రెవెన్యూ సిబ్బంది పోలీసులు ఐకెపి సెంటర్ నిర్వాహకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.