పెద్దేముల్ : తెలంగాణ ప్రభుత్వంలో అన్ని వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ఇందూరు గ్రామంలోని చర్చి 50వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని కైస్తవ సోదరులను, గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు సమానంగా సంక్షేమ పథకాలను అందిస్తూ అన్ని వర్గాల ప్రజలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ వారి అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ముఖ్యంగా నిరుపేద ప్రజలకు, రైతులకు, పింఛను దారులకు అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేయడంలో సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోలిస్తే ముందంజలో ఉన్నారని, తెలంగాణలో ప్రతి ఒక్కరి సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యంగా పాలన కొనసాగిస్తున్నారని అన్నారు.
కరోనా కష్టకాలంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కూడా అవరోదం లేకుండా విజయవంతంగా సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని అన్నారు. ప్రతి పండుగలకు వివిధ వర్గాల ప్రజలకు ప్రత్యేకంగా కానుకలు అందజేసి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని గుర్తు చేశారు. అనంతరం ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని చర్చి పెద్దలు, గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఇందూరు ఎంపీటీసీ ప్రవీణ్ పటేల్, తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, తాండూరు పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు నయిం (అప్పు), యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, పార్టీ సీనియర్ నాయకులు రమేశ్, తట్టేపల్లి పీఏసీఎస్ డైరెక్టర్ మొగులప్ప, చర్చి కమిటీ ప్రతినిధులు, పాస్టర్, ఇందూరు గ్రామ క్రైస్తవ సోదరులు, గ్రామస్తులు పాల్గొన్నారు.