వికారాబాద్, జూన్ 28 : ప్రభుత్వ దవాఖానలో అత్యాధునిక సదుపాయాలతో మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందించనున్నట్లు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. బుధవారం వికారాబాద్‌లోని ప్రభుత్వ దవాఖానలో రూ.25లక్షలతో ఏర్పాటు చేసిన కంటికి సంబంధించిన మిషన్‌ను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 10 జిల్లాలకు కంటికి సంబంధించిన మిషన్లు మంజూరు కాగా.. అందులో ఒకటి వికారాబాద్‌లోని ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేసుకొని ప్రారంభించినట్లు తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకొని కంటి చూపు మెరుగుపర్చుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం దవాఖానలోని ఓపీ, తదితర వైద్య సేవలను సందర్శించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ పల్వన్‌కుమార్, కౌన్సిలర్లు సురేశ్, అనంత్‌రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌వో జీవరాజ్, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ పాండు, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.