పరిగి, జూన్ 2 : వికారాబాద్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టును సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. హైదరాబాద్‌లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తో కలిసి చీఫ్ జస్టిస్ వికారాబాద్ జిల్లా కోర్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్త జిల్లా కోర్టు ఏర్పాటు ద్వారా రంగారెడ్డి జిల్లా కోర్టు నుంచి వికారాబాద్ కోర్టుకు 18196 కేసులు బదిలీ అయ్యాయని చీఫ్ జస్టిస్ తెలిపారు. అనంతరం వికారాబాద్‌లో జిల్లా కోర్టు భవనాన్ని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్ ప్రారంభించారు. న్యాయవాద వృత్తిలో రాణించాలంటే కష్టపడడంతోపాటు నిజాయితీ ముఖ్యమని సుదర్శన్ పేర్కొన్నారు. జిల్లా కోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం న్యాయవాద వృత్తిలో 50 ఏండ్లు పనిచేసిన న్యాయవాదులు పరమానందరావు, కమాల్రెడ్డిలను బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు.
క్లయింట్‌కు సరైన న్యాయం చేయాలి
ఈ సందర్భంగా సుదర్శన్ మాట్లాడుతూ.. చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ చొరవ, సహకారం, ఆశీస్సులతోనే కొత్త జిల్లా కోర్టుల ఏర్పాటు జరిగిందని తెలిపారు. అందుకు కావాల్సిన సదుపాయాలను ముఖ్యమంత్రి సమకూరుస్తున్నారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఎన్.వి.రమణ పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాతే తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్యను పెంచారని తెలిపారు. మన ఆర్థిక వనరులు మనకే ఉండాలని, మనమే ఉపయోగించుకోవాలనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రమణ అభిప్రాయంతో తానూ ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. కష్టపడకపోతే న్యాయవాద వృత్తిలో పైకి రాలేరన్నారు. మొదటి తరం న్యాయవాదులు కనీసం రెండుమూడు సంవత్సరాలు ప్రారంభంలో కుటుంబం నుంచి ఆర్థిక సాయంతో పనిచేయాలన్నారు. క్లయింట్‌కు సరైన న్యాయం చేస్తే జీవితాంతం కృతజ్ఞతతో ఉంటారన్నారు. తక్కువ ఫీజు ఇచ్చినా వేరే కేసులు వస్తాయని పేర్కొన్నారు. న్యాయవాదులకు నిజాయితీ అనేది పెట్టని కోటలా ఉండాలన్నారు. తాను న్యాయవాదిగా పనిచేసిన సమయంలో కొన్ని కేసులు డబ్బులు తీసుకోకుండా వాదించినట్లు తెలిపారు. షాద్‌నగర్‌కు చెందిన ఒక క్లయింట్ కేసును తాను డబ్బులు తీసుకోకుండా వాదించి కేసు గెలిచానని, తాను ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లినా ఆ కేసులో తన సలహా కోసం క్లయింట్ తనను కలిసేవారని తెలిపారు. జూనియర్లు పెద్దల సూచనలు పాటించాలన్నారు.
బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్‌పటేల్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో బార్ అసోసియేషన్ వెన్నంటి ఉండడంతోనే తాము మరింత ఉత్సాహంతో పోరాటం చేశామన్నారు. కోర్టు భవనాల కోసం మంచి స్థలం ఇవ్వాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితారెడ్డిని కోరామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే, బార్ అసోసియేషన్ నాయకులతో మంత్రిని కలిసి స్థలం కేటాయింపుపై విన్నవించనున్నట్లు తెలిపారు.
హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యుడు అనంతసేనారెడ్డి మాట్లాడుతూ.. వికారాబాద్‌లో జిల్లా కోర్టు ఏర్పాటుతో ఇబ్బందులు తీరిపోయాయన్నారు. ముఖ్యమంత్రి న్యాయ వ్యవస్థకు సహకరించడం ఆయన ముందుచూపునకు నిదర్శనమని చెప్పారు.
బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మాధవరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులది గొప్ప పాత్ర అని తెలిపారు. వికారాబాద్ కోర్టుకు స్థల కేటాయింపు అంశంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ, సీఎం కేసీఆర్‌లను జిల్లాలోని ఎమ్మెల్యేలతోపాటు కలిసి విన్నవిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి శంకర్ శ్రీదేవి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్, జూనియర్ సివిల్ జడ్జి శృతిదూత్, హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యుడు అనంతసేనారెడ్డి, అడిషనల్ ఎస్పీ రషీద్, తాండూరు ఆర్డీవో అశోక్‌కుమార్, తహసీల్దార్ షర్మిల, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మాధవరెడ్డి, ప్రధాన కార్యదర్శి జగన్, జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ బార్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.
ఆమనగల్లులో జూనియర్ సివిల్ కోర్టు, ప్రథమ శ్రేణి న్యాయస్థానం ప్రారంభం
కడ్తాల్/ఆమనగల్లు, జూన్ 2 : ఆమనగల్లు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ కోర్టు, ప్రథమ శ్రేణి న్యాయస్థానాన్ని గురువారం సాయంత్రం స్థానిక న్యాయవాదులతో కలిసి జూనియర్ సివిల్ జడ్జి సంపతిరావు చందన ప్రారంభించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు న్యాయ సేవలను ప్రజలకు చేరువ చేసేందుకు, కొత్త జిల్లాల్లో కోర్టుల ఏర్పాటుకు న్యాయ శాఖ కార్యాచరణ రూపొందించింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు, కడ్తాల్, మాడ్గుల, తలకొండపల్లి మండలాలను కలిపి ఆమనగల్లు మండలంలో నూతనంగా జూనియర్ సివిల్ జడ్జి, ప్రథమ శ్రేణి న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసింది. తొలి రోజు కోర్టులో ఒక కేసుకు సంబంధించి ఆమనగల్లు పోలీసులు నిందితుడిని జడ్జి ముందు ప్రవేశపెట్టారు. కార్యక్రమంలో కల్వకుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణయ్య, సభ్యులు లక్ష్మణశర్మ, వెంకట్‌రెడ్డి, వెంకట్‌గౌడ్, వెంకటేశ్వరరావు, భాస్కర్‌రెడ్డి, వెంకటరమణ, యాదిలాల్, నరేందర్‌రెడ్డి, లక్ష్మణ్‌రాజు, మల్లేశ్‌గౌడ్, జయంత్‌కుమార్, రామకృష్ణ, ఆంజనేయులు, శేఖర్, మల్లేశ్, మధు పాల్గొన్నారు.