పెద్దేముల్, ఆగస్టు 21 : గ్రామపంచాయతీ, పల్లె దవాఖాన, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ మరమ్మతుల నిర్మాణ పనుల్లో కచ్చితంగా నాణ్యతా ప్రమాణాలను పాటించాలని వికారాబాద్ జిల్లా ఇన్చార్జి అడిషనల్ కలెక్టర్ సుధీర్ సూచించారు. బుధవారం మండల పరిధిలోని తట్టేపల్లి గ్రామంలో పర్యటించి నూతనంగా నిర్మిస్తున్న గ్రామపంచాయతీ, పల్లె దవాఖాన, వివిధ పాఠశాలల్లో చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాల మరమ్మత్తుల పనులు, అంగన్వాడీ కేంద్రాలు, ఆయా పాఠశాలల పరిసరాలు, తరగతి గదులు, పారిశుధ్య పనులను అధికారుల బృందంతో కలిసి ఆకస్మికంగా పరిశీలించారు.
తట్టేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8, 9, 10వ తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో పాఠ్యపుస్తకాలను చదివించి పలు అంశాలపై విద్యార్థులను ప్రశ్నించారు. ముందుగా తనిఖీల్లో భాగంగా గ్రామపంచాయతీ, పల్లె దవాఖాన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం తట్టేపల్లి ప్రాథమిక పాఠశాలలో మూత్రశాలలు, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై అసహనం వ్యక్తం చేశారు. తర్వాత హరిజన్వాడ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు.
అంతకుముందు ప్రాథమిక పాఠశాల ఆవరణలో కొనసాగుతున్న హెల్త్ సబ్ సెంటర్‌ను పరిశీలించి గ్రామంలో ఫీవర్ సర్వే చేపడుతున్నారా?లేదా? ప్రజలకు మందులను అందుబాటులో ఉంచుతున్నారా? లేదా? గ్రామాల్లో పర్యటిస్తున్నారా? లేదా? అనే విషయాలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకొన్నారు. హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో నీటి ట్యాంక్‌ను క్రిందిభాగంలో పెట్టడంపై అసహనం వ్యక్తం చేస్తూ దానిని వెంటనే మార్చాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట తాండూరు డీఎల్పీవో శంకర్‌నాయక్, ఎంపీడీవో జర్నప్ప, ఎంపీవో రతన్‌సింగ్, పీఆర్ డీఈ, పీఆర్ ఏఈ, ఈసీ, వైద్య సిబ్బంది, హెచ్ఎంలు, ఏసీడీపీఓ లక్ష్మి, మాజీ ఎంపీటీసీ శంకర్, నాయకులు గోపాల్, నర్సింహులు, హన్మంతు, తట్టేపల్లి పీఏసీఎస్ వైస్ చైర్మన్ అంజయ్య పాల్గొన్నారు.
అంతారంలో సీసీ రోడ్లు, పాఠశాల సందర్శన
తాండూరు రూరల్ : తాండూరు మండలం అంతారం గ్రామంలో రూ.8 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, మురుగు కాలువలను జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ పరిశీలించారు. అనంతరం పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో మూత్రశాలలరె పరిశుభ్రంగా పెట్టుకోవాలని సూచించారు. గదులపై పెరిగిపోయిన గట్టిని వెంటనే తొలగించాలని ఆదేశించారు. అనంతరం పాఠశాలలోని ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు.
ఓ ఉపాధ్యాయుడు హాజరు రిజిస్టర్లో సంతకం ఎందుకు పెట్టలేదని హెచ్ఎంను ప్రశ్నించగా.. తరగతి గదిలో ఉన్నారని.. పక్షవాతం కారణంగా సంతకం పెట్టలేదని సమాధానం ఇచ్చారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. విద్యార్థులకు భోజన వసతిపై ఆరా తీశారు. గ్రామంలో మురుగు కాలువ నిర్మాణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నిర్మించారని ఏఈ నందినిరెడ్డిని ప్రశ్నించారు. సీసీ రోడ్డు పనులపై కూడా ఆరా తీశారు. ఆయన వెంట ఎంపీడీవో విశ్వప్రసాద్, డీఎల్పీవో, డీఈఈ, ఏఈ, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.