తాండూరు రూరల్, మార్చి 29 : అధికారుల పని తీరుపై వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పల్లె ప్రగతి పనులు సక్రమంగా లేవని కలెక్టర్ సంబంధిత అధికారులపై మండిపడ్డారు. బుధవారం తాండూరు మండలం ఎల్మకన్నె గ్రామాన్ని అకస్మికంగా సందర్శించారు. కలెక్టర్ ముందుగా గ్రామ సమీపంలోని కాగ్నా వాగుపై రూ.7 కోట్లతో నిర్మిస్తున్న చెక్‌డ్యాం పనులను పరిశీలించారు. పనులు వేగంగా జరిగేలా చూడాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. మే 15 వరకు పురోగతి కనిపించాలని ఆదేశించారు. కాగ్నా వాగుపై 6 చెక్‌డ్యాంల నిర్మాణాలు జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. అనంతరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి, చిన్నారులతో మాట్లాడారు. కేంద్రానికి ఎంత మంది చిన్నపిల్లలు వస్తున్నారని సీడీపీవో రేణుకను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులు, గర్భిణులకు బలవర్ధకమైన ఆహారమందించాలని ఆదేశించారు.
ట్రాన్స్ఫార్మర్కు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి
పాఠశాలకు వెళ్లే క్రమంలో పాఠశాల పక్కనే ట్రాన్స్ఫార్మర్ ఉండడాన్ని గమనించి, పాఠశాల పక్కనే ట్రాన్స్ఫార్మర్ ఉంటే విద్యార్థులకు ప్రమాదం కాదా? అని విద్యుత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ చెత్తాచెదారం పేరుకుపోవడంపై పంచాయతీ కార్యదర్శిని ప్రశ్నించారు. వెంటనే ట్రాన్స్ఫార్మర్కు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక్కడి నుంచి వెంటనే చెత్తాచెదారాన్ని తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఎక్కాలు చదవడానికి తడబడ్డ విద్యార్థులు
పాఠశాలలో 4, 5 తరగతులు కొనసాగుతున్నాయి. ఎక్కాలు ఎంతవరకు వస్తాయని కలెక్టర్ విద్యార్థులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా కొందరితో ఎక్కాలు చదివించగా తడబడ్డారు. అలాగే బ్లాక్ బోర్డుపై లెక్కలు చేయాలని విద్యార్థులను కోరగా అదే పరిస్థితి. అక్కడే ఉన్న గణిత ఉపాధ్యాయుడు హర్షవర్ధన్ కల్పించుకొని విద్యార్థులకు ఏదో చెప్పబోగా.. కలెక్టర్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి ఇంట్లో ఉండి లెక్కలు చేసుకోవాలంటూ కలెక్టర్ గణిత ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు వేశారు. పాఠశాలలోని మరుగుదొడ్లను పరిశీలించి.. పరిశుభ్రంగా లేవని పంచాయతీ కార్యదర్శి సరితకు మెమో జారీ చేశారు. ఎంపీఈవో రతన్సింగ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ నిధులతో మూత్రశాలలు, మరుగుదొడ్లను శుభ్రం చేయించాలని ఆదేశించారు. అనంతరం వైకుంఠధా మం, నర్సరీ, డంపింగ్ యార్డు, మినీ పల్లెపకృతి వనాన్ని పరిశీలించారు. మినీ పల్లె పకృతి వనం అభివృద్ధికి రూ.3 లక్షలు మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. రూ.10లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు పనులను కూడా పరిశీలించారు.
జిల్లాలో హరితహారం కింద 49 లక్షలు మొక్కలు నాటే లక్ష్యం
జిల్లాలో 49 లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. గ్రామాల్లో రెండు కిలోమీటర్ల మేర ఇరువైపులా మొక్కలు నాటాలని సూచించారు. కొత్త ఫార్మేషన్ రోడ్లు కూడా వేసేందుకు కృషిచేయాలన్నారు. కెనాల్, ట్యాంకుల వద్ద కూడా మొక్కల పెంపకాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో పరిశుభ్రతపై అధికారులు దృష్టి సారించాలని పేర్కొన్నారు. నాపరాతి గనులు, సుద్ద గనులపై పరిశీలన చేస్తున్నామని తెలిపారు. ఇసుక అక్రమ దందాకు ఫుల్స్టాప్ పెట్టేందుకు కార్యాచరణ చేపట్టబోతున్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఈఈ సుం దర్, ఏఈ సాయిలు, తహసీల్దార్ చెన్నప్పలనాయుడు, ఎంపీడీవో సుదర్శన్‌రెడ్డి, సర్పంచ్ నాగమణి, బీఆర్ఎస్ నాయకుడు జగదీశ్ ఉన్నారు.
వికారాబాద్ : పెద్దేముల్ మండలం మన్సాన్పల్లి గ్రామ కార్యదర్శి గోపాల్, ఫీల్డ్ అసిస్టెంట్ చందర్, నవాబుపేట మండలం మీనపల్లి గ్రామ కార్యదర్శి సుజిత్కుమార్లను సస్పెండ్ చేశారు. మన్సాన్పల్లి సర్పంచ్ రుక్కీబాయికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.