వికారాబాద్, జూన్ 10 : మూడు నెలలుగా రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ కారణంగా ప్రజావాణి నిలిచిపోయింది. ఈ నెల 6న కోడ్ ముగియడంతో సోమవారం రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ప్రజావాణి ప్రారంభం కాగా, ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అదనపు కలెక్టర్ లింగ్యానాయక్‌తో కలిసి ప్రజల నుంచి 96 దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శాఖలవారీగా పెండింగ్‌లో ఉన్న వివిధ పనులు త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల్లో జరుగుతున్న పనులను అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పూర్తయ్యేలా చూడాలన్నారు.
ఈ నెల 12 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా మెరుగైన వసతులు కల్పించాలన్నా రు. పాఠ్య, నోట్ పుస్తకాలతోపాటు యూనిఫామ్‌ను అందించాలని అధికారులకు సూచించారు. పాఠశాలల మరమ్మతుల నిమిత్తం రూ.50 కోట్లు మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. బడిబాటలో భాగంగా అధిక సంఖ్యలో బడీడు పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా బడిబాటలో మహిళా సంఘాలు భాగస్వాములు అయ్యేలా చొరవ చూపాలన్నారు. జిల్లాలోని పాఠశాలలు, వసతిగృహాల్లో మౌలిక వసతులు కల్పించడంతోపాటు ఏమైనా మరమ్మతులుంటే పూర్తి చేయాలన్నారు.