
వీధినాటకాల్లో ప్రశంసలందుకుంటున్న ఉపాధ్యాయుడు
వృత్తిలోనూ రాణిస్తున్న వెంకటాచారి
అందరిచే శభాష్ అనిపించుకుంటున్న పండితుడు
యాచారం, ఆగస్టు 28 : ఓవైపు పాఠశాలలో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతూనే మరోవైపు వీధి నాటకాల్లో అలరిస్తున్నాడు ఓ ఉపాధ్యాయుడు. చేతిలో పుస్తకం పట్టుకొని పిల్లలకు పాఠాలు చెబుతూ, కాలికి గజ్జెలు కట్టుకొని, ఒళ్లంతా రంగులు పూసుకొని వీధి నాటకాల్లో తన ఆట పాటలతో ప్రజలను మెప్పిస్తున్నాడు. కళా రంగంలో ఏ పాత్ర వేసినా దానికి జీవం పోయడం ఆయన ప్రత్యేకత. ఎలాంటి పాత్రనైనా అలవోకగా వేస్తూ, తన మధురమైన గొంతుతో అపారమైన ఆటపాటలతో అందరినీ ఆకట్టుకుంటాడు. పాఠశాలలో విద్యార్థులకు పండితుడిగా, వీధినాటకాల్లో కళాకారులకు మాస్టారుగా బాధ్యతలను నిర్వహిస్తున్నాడు యాచారం మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు నారోజు వెంకటాచారి.
వృత్తిలో రాణిస్తూ…
మండలంలోని తాడిపర్తి గ్రామానికి చెందిన వెంకటచారి 2008లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నియమితుడయ్యాడు. మొదట్లో షాబాద్ మండలంలో వృత్తి చేపట్టిన అతడు ప్రస్తుతం కుర్మిద్ద ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఉపాధ్యాయుడిగా విధి నిర్వహణలో తనకుతానే సాటి. తెలుగుతో పాటు గణితం, ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూ, మాతృభాష ప్రాముఖ్యతను వివరించేందుకు కృషి చేస్తున్నాడు. చక్కని చేతిరాతతో పాటు, రాగంతీసి పద్యాలు పాడటం, గొంతెత్తి పాటలు పాడటం, విద్యార్థులను తెలుగు భాషలో పట్టు సాధించేలా తీర్చిదిద్దడంలో అతడు దిట్ట. పాఠశాలలో రంగులు, బొమ్మలు వేయించడంతో పాటుగా, మధ్యాహ్న భోజనానికి సరిపడా కూరగాయలను సేంద్రియ ఎరువులతో పాఠశాలలోనే సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అనేక అంశాల్లో విద్యార్థులకు అవగాహన సదస్సులను నిర్వహించి అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతున్నాడు. పాఠశాలలో తగ్గుతున్న విద్యార్థుల సంఖ్యను తన బోధన విధానంతో రెట్టింపు చేశాడు. గతంలో మండలస్థాయి, జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డును అందుకున్నాడు. ఉపాధ్యాయ వృత్తిలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించి అందరిచే శభాష్ అనిపించుకుంటున్నాడు.
వీధి నాటకాల్లో అలరిస్తూ..
పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు వీధి నాటకాల్లో తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. చిన్నతనం నుంచే ఆటాపాటలపై తనకు మక్కువ ఎక్కువ. వీధి నాటకాల్లో వేషం వేసి తన కళతో అందరినీ అబ్బుర పరుస్తున్నాడు. ఇరవై ఏండ్లుగా వీధి నాటకాల్లో పాల్గొంటూ ప్రజలను ఉత్సాహపరుస్తున్నాడు. ఎంతటి పాత్రనైనా వెంకటాచారి ముందు చిన్నబోవాల్సిందే మరి. అతడి రాగం వింటే మైమరచిపోవాల్సిందే. నేటి కాలంలో అంతరించిపోతున్న కళకు ఆయన జీవం పోస్తున్నాడు. వివిధ రకాల వీధి నాటకాల్లో మహా విష్ణువు, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, నవాబు తదితర పాత్రలు పేరు తెచ్చాయి. తాడిపర్తితో పాటు హైదరాబాద్లోని కర్మన్ఘాట్, మీర్పేట్, రవీంద్రభారతిలో నాటకాలను తరచూ ప్రదర్శిస్తుంటాడు. అతడి ఆటతీరుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. పలుమార్లు పాఠశాలలో ఆయనను ఘనంగా సన్మానించారు. విద్యార్థులను చదువు, క్రీడలతో పాటుగా సాంస్కృతిక రంగంలోనూ తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాడు. రవీంద్రభారతిలో వెంకటాచారికి ప్రత్యేక గుర్తింపు ఉండటం గమనార్హం.
గ్రామీణ కళను ప్రోత్సహించాలి..
అంతరించి పోతున్న నాటి గ్రామీణ కళను ప్రతి ఒక్కరూ ఆదరించి, ప్రోత్సహించాలి. వివిధ రంగాలలో రాణిస్తున్న కళాకారులకు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపునిచ్చి వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలి. వీధి నాటకాలు అంతరించిపోకుండా చూడాలి. బతికించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటుగా, వీధి నాటకాలను, కళాకారులను కాపాడుకోవడం కోసం కృషి చేస్తా.