
దోమ, ఆగస్టు 25: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా బ్రాహ్మణపల్లి గ్రామం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. పచ్చదనం, పరిశుభ్రతతో గ్రామం కొత్త రూపును సంతరించుకున్నది. రెండున్నరేండ్లలో రూ.40 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టారు. పంచాయతీలోని ప్రతి వీధిలో సీసీ రోడ్లు, కంపోస్టు షెడ్డు, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం పనులు పూర్తయ్యాయి. కాగా వార్డుల్లో కొత్త డ్రైనేజీల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారుచేశారు. గ్రామానికి తలమానికంగా రైతు వేదిక నిలిచింది. క్లస్టర్ స్థాయి రైతు వేదిక నిర్మాణంతో వివిధ గ్రామాల నుంచి రైతులు పంటల సాగుపై నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఇంటింటికీ మిషన్ భగీరథ తాగు నీటిని సరఫరా చేయడంతో గ్రామంలో నీటి సమస్య పరిష్కారమైంది. గ్రామ సర్పంచ్ జగని వెంకటయ్యతో పాటు పాలక వర్గ సభ్యులు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో గ్రామాన్ని అభివృద్ది పథంలో నడిపేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ప్రతి రోజూ పంచాయతీ ట్రాక్టర్‌తో తడి, పొడి చెత్త సేకరించి కంపోస్టు షెడ్డుకు తరలిస్తూ, గ్రామంలో స్వచ్ఛత, పరిశుభ్రతకు కృషి చేస్తున్నారు. నాటిన మొక్కలను సంరక్షించడం, ప్రతి వార్డులో విద్యుత్ స్తంభాలకు ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయడంతో గ్రామ రూపురేఖలే మారిపోయాయి. రూ.2.5 లక్షలతో కం పోస్టు షెడ్డు, రూ.8.40 లక్షలతో పంచాయతీకి ట్రాక్టర్, రూ.12.60 లక్షలతో వైకుంఠధామం, మౌలిక సదుపాయాలు కల్పించారు. రూ.5 లక్షలతో వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణం తదితర అభివృద్ధి పనులు పూర్తి చేశారు.
గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ సహకారాన్ని అందిపుచ్చుకుని ప్రతి పైసాను సద్వినియోగం చేసుకుంటున్నాం. అధికారులు, గ్రామస్తుల సలహాలు, సూచనలతో గ్రామ అవసరానికి కావాల్సిన పనులు చేపట్టి గ్రామంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం.
గ్రామంలో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు, ప్రభుత్వం నిర్దేశించిన అభివృద్ధి పనులు కూడా పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నాం. గ్రామంలో ఎప్పటికప్పుడు సమస్యలను గుర్తించి పరిష్కరిస్తున్నాం. వైకుంఠధామం, మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్, కంపోస్టు షెడ్డు పూర్తి చేశాం. గ్రామస్తుల భాగస్వామ్యంతో అభివృద్ధికి వారి సూచనలను పరిగణనలోకి తీసుకుంటున్నాం.
టీఆర్ఎస్ ప్రభుత్వ సహకారంతోనే అభివృద్ధి సాధ్యపడింది. గత ప్రభుత్వాలు పల్లెలకు ఇంతటి ప్రాధాన్యత ఏనాడూ ఇవ్వలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం వాటికి జవసత్వాలు కల్పిస్తూ పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నది. దీంతో అభివృద్ధిని పొందగలుగుతున్నాం. అందుకే గ్రామం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నది.