‘పల్లె ప్రగతి’తో మారిన గ్రామ రూపురేఖలు గ్రామ రోడ్డుకు ఇరువైపులా పచ్చని తోరణాల్లా హరితహారం మొక్కలు
ప్రతి వీధిలో సీసీ రోడ్డు, మురుగు కాల్వలు రాత్రి వేళల్లో జిగేల్మంటున్న విద్యుద్దీపాలు
చిట్టడివిలా ‘పల్లె ప్రకృతి వనం’ కంపోస్టు షెడ్డులో సేంద్రియ ఎరువు తయారీ
అందుబాటులోకి వైకుంఠధామం పక్కాగా పారిశుధ్య నిర్వహణ హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
పెద్దేముల్, సెప్టెంబర్ 20: పల్లె ప్రగతిలో భాగంగా జనగాం పంచాయతీలో మౌలిక వసతులు కల్పించారు. పెద్దేముల్ మండలంలోని జనగాం పంచాయతీ సర్పంచ్ ఎం.రుక్మిణమ్మ, ఉప సర్పంచ్ పార్వతమ్మ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు గ్రామాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి, అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఇప్పటికే గ్రామంలోని అన్ని కాలనీల్లో మిషన్ భగీరథతో తాగునీటి సౌకర్యం, వ్యక్తిగత మరుగుదొడ్లు, విద్యుత్, వైద్యం, సీసీ రోడ్లు, మురుగు కాల్వలతోపాటు రూ.40వేలతో కంపోస్టు షెడ్డు, డంపింగ్యార్డు, నర్సరీ ఏర్పాటుచేశారు. రూ.12.50 లక్షలతో వైకుంఠధామం, రూ.2.50 లక్షలతో ప్రకృతి వనం, రూ.9.31లక్షలతో పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, వాటర్ ట్యాంకర్, లెవల్ బ్లేడ్లు కొన్నారు.
రూ.27 లక్షలతో అభివృద్ధి పనులు
జనగాం పంచాయతీలో మొత్తం జనాభా 2,340 ఉండగా, 1635 మంది ఓటర్లు, 610 ఇండ్లు ఉన్నాయి. గ్రామంలో రెండు మిషన్ భగీరథ ట్యాంకులు నిర్మించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా రూ.3.20 లక్షలతో బీసీ కాలనీలో సీసీ రోడ్డు, రూ.4 లక్షలతో ఎస్సీ కాలనీలో మురుగు కాల్వలు, రూ.2.50 లక్షలతో ఎస్సీ కాలనీలో మురుగు కాల్వలు, రూ.15 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో బీసీ కాలనీలో సీసీ రోడ్డు, గ్రామంలో ప్రధాన రోడ్లకు ఇరువైపులా, కాలనీ రోడ్లకు రూ.1.60 లక్షలతో మొరం పోయించారు. 11 వేల మొక్కలతో వన నర్సరీ, పంచాయతీ నిధులు రూ.70 వేలతో పల్లె ప్రకృతి వనంలో జామ, దానిమ్మ, అల్లనేరేడు, చింత, చైనా బాదాం, గులాబీ, మందార, వేప, మల్లెపూవుల వంటి 500 రకాల మొక్కలు, ప్రధాన రోడ్లకు ఇరువైపులా 300 మొక్కలు, స్థానిక పాఠశాల చుట్టూ 300 మొక్కలు నాటి వాటికి రక్షణగా ట్రీ గార్డులు ఏర్పాటు చేశారు. రూ.7 లక్షల డీఎంఎఫ్టీ నిధులతో సీసీ రోడ్డు పనులు మంజూరు కాగా వాటిని కూడా త్వరలో ప్రారంభించి, పూర్తి చేయనున్నారు. స్థానిక సర్పంచ్ ఎం.రుక్మిణమ్మ, ఉపసర్పంచ్ పార్వతమ్మ ఒక ప్రణాళిక ప్రకారం కాలనీలవారీగా గ్రామస్తుల సహాయ సహకారాలతో దశల వారీగా పలు రకాల అభివృద్ధి పనులు చేపడుతూ జనగాం గ్రామాన్ని అభివృద్ధి పరుస్తున్నారు.
అభివృద్ధిలో దూసుకుపోతున్న జనగాం
మండలంలోని మొత్తం 37 పంచాయతీల్లో జనగాం పంచాయతీ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. ముఖ్యంగా గ్రామ పరిధిలో అన్ని కాలనీల్లో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, వ్యక్తిగత మరుగు దొడ్లు, వీధి దీపాలతోపాటు ప్రభుత్వ ఆదేశాల మేరకు డంపింగ్ యార్డు, కంపోస్టు షెడ్డు, వన నర్సరీ, మిషన్ భగీరథ ట్యాంకులు, పల్లె ప్రకృతి వనం, ప్రధాన రహదారికి ఇరువైపులా చెట్లు, ట్రాక్టర్ కొనుగోలు చెత్త సేకరణతో పాటు పలు రకాల అభివృద్ధి పనులు పూర్తి చేశారు.
గ్రామ అభివృద్ధికి కృషి
గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పటికే గ్రామంలో సుమారు రూ.27 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్లు, మురుగుకాల్వలు, మొరం పనులు, మొక్కలు నాటే కార్యక్రమం, రకాల అభివృద్ధి పనులను పూర్తి చేయడం జరిగింది,ఇంకా పెండింగ్లో ఉన్న పనులను దశలవారీగా పూర్తి చేసి గ్రామాన్ని ఆదర్శంగా చేస్తా.
సమస్యలన్నీ పరిష్కరిస్తున్నాం
గ్రామాభివృద్ధిలో భాగంగా గ్రామంలో ఇప్పటికే నూతనంగా డంపింగ్యార్డు, కంపోస్టు షెడ్డు, నర్సరీ, మిషన్ భగీరథ ట్యాంకులు, పల్లె ప్రకృతి వనం, ప్రధాన రహదారికి ఇరువైపులా చెట్లు, మొరం పోయించే పనులు, సీసీ రోడ్లు,మురుగు కాల్వల నిర్మాణాలు పూర్తి చేశాం. గ్రామ అభివృద్ధిలో భాగంగా అభివృద్ధి పనులపరంగా సహకరిస్తున్న గ్రామ ప్రజలకు ధన్యవాదాలు.గ్రామంలో మున్ముందు ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు సేవలందిస్తున్నాం.