
వైభవంగా వరలక్ష్మీ వ్రతం
దేవాలయాల్లో కుంకుమార్చనలు
ఆలయాలు, ఇండ్లలో ప్రత్యేక పూజలు చేసిన మహిళలు
కొడంగల్, ఆగస్టు 20: అష్టలక్ష్మీ రూపాల్లో తమ కోరికలు తీరుస్తుందని భావించి వరలక్ష్మీదేవిని శ్రావణమాసంలోని పౌర్ణమి ముందు వచ్చు శుక్రవారంన వరలక్ష్మీ వ్రతం ఆచరించడం ఆనవాయితీగా వస్తున్నది. పండ్లు, పూలతో అమ్మవారిని అలంకరించి, సుమంగళులకు పసుపు, కుంకుమ వాయినాలతో, తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు అందుకున్నారు. మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలోని శ్రీదేవి, శ్రీ గోదాదేవి అమ్మవార్లకు అర్చకులు పూజలు చేశారు.
కులకచర్లలో..
కులకచర్ల, ఆగస్టు 20: మండలంలోని వివిధ గ్రామాల్లో మహిళలు శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ వ్రతాలు భక్తశ్రద్ధలతో నిర్వహించారు. ఆయా గ్రామాల్లో వారివారి ఇండ్లలో లక్ష్మీదేవి చిత్రపటాలకు పూజల చేశారు. అమ్మవారికి రకరకాల నైవేద్యాలు సమర్పించారు. తమ సౌభాగ్యాన్ని చల్లగా ఉంచు తల్లి అని అమ్మవారిని మొక్కుకున్నారు. బండవెల్కిచర్లలోని శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయంలో వరలక్ష్మి వ్రతం చేశారు.
తాండూరులో..
తాండూరు, ఆగస్టు 20: నిత్య సుమంగళిగా ఉండాలని కోరుతూ మహిళలు భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని వైభవంగా శుక్రవారం నిర్వహించారు. లక్ష్మీదేవిని సర్వమంగళ సంప్రాప్తి కోసం ప్రార్థిస్తూ నియమ నిష్టలతో ప్రత్యేక పూజలు, వ్రతాలు చేశారు. తాండూరు, యా లాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లోని ఆలయా ల్లో అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ చేసి పూజించారు.
వికారాబాద్‌లో..
వికారాబాద్, ఆగస్టు 20: సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని అత్యంత భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు ఆచరిస్తారు. వికారాబాద్‌లోని శివరాంనగర్ కాలనీ సంతోషిమాత ఆలయంలో, మారుతీ నగర్‌లోని అమ్మవారి ఆలయం, పలు దేవాలయాల్లో మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలో ఈ వ్రతాన్ని నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ మంజులతో పాటు పలువురు మహిళా కౌన్సిలర్లు వ్రతాలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
నాగసముందర్లో..
ధారూరు, ఆగస్టు 20: మండలంలోని నాగసముందర్లో వరలక్ష్మీ వ్రతం ఘనంగా నిర్వహించారు. రంగు రంగుల పూలతో లక్ష్మీ దేవికి అందరు కలిసి పూజలు చేశారు. గ్రామంలో అన్నదానం చేశారు.
మర్పల్లిలో..
మర్పల్లి, ఆగస్టు 20: మర్పల్లి మండలంలోని వివిధ గ్రామాలలో శుక్రవారం వరలక్ష్మీ పూజలు ఘనంగా నిర్వహించారు. గ్రామాలలో ఉదయం నుంచి మహిళలు నిష్టతో వరలక్ష్మీ దేవిని రంగు రంగుల పూలతో అందంగా అలంకరణ చేసి మాతకు ఉపవాస దీక్షలతో చిన్నలు, పెద్దలు, మహిళలు అందరు కలిసి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం వాయినాలు ఇచ్చుకు న్నారు. కొన్ని దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.