బంట్వారం, అక్టోబర్ 8 : డెంగ్యూ వ్యాధిపై నిర్లక్ష్యం వహించరాదని జిల్లా మలేరియా నియంత్రణ అధికారి సాయిబాబా పేర్కొన్నారు. మండలంలోని బొపునారం గ్రామంలో డెంగ్యూ కేసు నమోదవడంతో జిల్లా వైద్యాధికారులు గ్రామాన్ని సందర్శించి పరిసరాలను పరిశీలించి, డెంగ్యు నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామాల్లోని ప్రతి వీధిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ విషయంలో సర్పంచ్, వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం గ్రామంలోని పలు వీధులు, ఇండ్లల్లో దోమల నివారణ మందులను పిచికారీ చేయించారు.
డెంగ్యూ, మలేరియా కట్టడికి సమన్వయంతో పనిచేద్దామని సాయిబాబా కర్ణాటక వైద్యాధికారులతో సమావేశమై సమీక్షించారు. జిల్లాలోని బొపునారం, తొరుమామిడి, బస్వాపూర్, పెద్దేముల్ మండలంలోని తట్టేపల్లి, అడ్కిచర్ల, జైరాంతండా, బాయిమీదితండా తదితర గ్రామాల ప్రజలు ప్రతి రోజు కర్ణాటకలోని కుంచవరం కమ్యూనిటీ దవాఖానకు చికిత్స నిమిత్తం వెళ్తుంటారు. దీంతో జిల్లా అధికారులు కుంచవరం సీహెచ్సీ సూపరింటెండెంట్ బాలాజీతో సమావేశమై తెలంగాణ నుంచి వచ్చే రోగుల సమాచారాన్ని సేకరించారు. కొవిడ్ వ్యాక్సిన్ తెలంగాణ వారికిస్తే వివరాలను అందించాలన్నారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. వృత్తిరీత్యా తాము ప్రతి రోగికి ఎలా చికిత్సలు అందించాలో అదే అనుసరిస్తున్నామన్నారు. ప్రత్యేకమైన పరిస్థితుల్లో అవసరమైతే మీకు సమాచారాన్ని అందిస్తామన్నారు. కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ అధికారి రత్నాకర్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కృష్ణ, హెచ్ఎం ఐలయ్య, సర్పంచ్ కల్పన ఉన్నారు.