కులకచర్ల, సెప్టెంబర్7: వానకాలంలో విద్యుత్ మోటార్ల వద్ద రైతులు అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్యం వహిస్తే నిండు ప్రాణాన్ని బలితీసే ప్రమాదం ఉన్నది. విద్యుత్ మోటార్ల చిన్న చిన్న సమస్యలు కొందరి ప్రాణాల మీదకు తెస్తున్నది. వైర్లు తెగిపడడం, తీగలను ఎలుకలు కొరకడం, సరైన విధంగా స్టార్టర్, ప్యూజులు బిగించుకోక పోవడంతో మరికొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
విద్యుత్ స్తంభం నుంచి మోటార్ మధ్య ఎక్కువ దూరం ఉండకుండా చూడాలి. దూరం ఎక్కువగా ఉంటే గాలులు వీచినప్పుడు సర్వీసు వైరు తెగిపడే అవకాశం ఉంటుంది. విద్యుత్ స్తంభం నుంచి మోటర్‌కు కరెంట్ నేరుగా సరఫరా కాకుండా మధ్యలో ప్యూజ్ బాక్స్, స్టార్టర్ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. సాధారణంగా వ్యవసాయానికి ఉపయోగించే ఏసీ మోటార్ స్టార్టింగ్ సమయంలో మామూలు కంటే మూడు లేదా నాలుగు రెట్లు ఎక్కువ కరెంటు తీసుకుంటుంది. దీంతో మోటారుపై భారం పడి, అప్పుడప్పుడు విద్యుత్ సరఫరాలో అవరోధం ఏర్పడుతుంది. దీంతో ఫ్యూజు పోవడం కానీ మోటారు ఆగిపోవడం కాని జరుగుతుంది.
ఫ్లాట్‌ఫాం నిర్మించుకోవాలి
బోరుబావి వద్ద విద్యుత్ మోటారుకు సిమెంటుతో కూడిన ప్లాట్‌ఫాంను నిర్మించుకోవాలి. దీంతో మోటారు బావిలోకి జారిపోకుండా, అటూ ఇటు కదలకుండా ఉంటుంది. ప్రతి రెండు, మూడు నెలలకోసారి ప్యూజు క్యారియర్‌ను శుభ్రం చేయాలి. స్టార్టర్‌ను ఆన్ ఆఫ్ చేసినప్పుడు అందులో భాగాలు కదులుతూ ఉంటాయి. స్టార్టర్ పదేపదే ఆగిపోతుంటే కరెంటు సరఫరాలోపం, వైర్లలో లోపం ఉండవచ్చు. వెంటనే సంబంధిత మెకానిక్‌తో మరమ్మతులు చేయించాలి.ముఖ్యంగా బల్లులు, ఎలుకలు, ఉడుతలు ప్యూజ్ బాక్స్ లోనికి వెళ్లి వైర్లను కొరికి వేస్తుంటాయి. ఇలాంటివి స్టార్టర్ బాక్స్‌లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మోటరును ముట్టుకునే సమయంలో, అక్కడ పనిచేసే సమయంలో, తడి తగలని షూలు, చెప్పులు తప్పనిసరిగా ధరించాలి. టెస్టర్‌ను తప్పకుండా వెంట ఉంచుకోవాలి. స్టార్టర్ నుంచి మోటారుకు విద్యుత్ అందించే వైర్ ఐఎస్ఐ మార్కు కలిగినదై ఉండాలి.
ప్యూజు కీలకం
చాలామంది రైతులు ప్యూజులను ఏర్పాటు చేయకుండా విద్యుత్ మోటార్లను నేరుగా స్టార్టర్లకు కలుపుతారు. దీంతో విద్యుత్ సరఫరాలో లోపం ఏర్పడితే మోటారు కాలిపోతుంది. విద్యుత్ సరఫరాలో తక్కువ ఓల్టేజీని దృష్టిలో ఉంచుకుని సరైన ప్యూజులు బిగించుకోవాలి. మోటారు వద్ద ప్యూజులు, ఇండికేటర్ బల్బులు, స్టార్టర్‌ను ఒక చెక్కపై బిగించి, ఇనుప డబ్బా కాకుండా ప్లాస్టిక్ డబ్బాలో బిగించడం శ్రేయస్కరం. ప్యూజులు, స్టార్టర్లకు ఎట్టిపరిస్థితుల్లోనూ తేమ తగలకుండా చూడాలి. ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఏదైనా సమస్య వస్తే విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. పశువులు ట్రాన్స్ఫార్మర్ల వద్దకు వెళ్లకుండా చూడాలి.
వానకాలంలో అప్రమత్తంగా ఉండాలి
రైతులు వానకాలంలో మోటార్ల వద్ద అప్రమత్తంగా ఉండాలి. వ్యవసాయ పనులు ప్రా రంభం కాగానే మోటా ర్లు, స్టార్టర్లు, ప్యూజులను మరమ్మతులు చేయించాలి. ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఫీజులు వేయవద్దు. ఏదైనా సమస్య ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లి, సమస్యను పరిష్కరించుకోవాలి.