భారీ వర్షంతో వికారాబాద్ జిల్లాలో జనజీవనం స్తంభించింది. రోడ్లు జలమయం కావడం.. చల్లటి ఈదురు గాలులు వీస్తుండటంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐదు రోజులుగా ఎడతెరిపిలేకుండా వానలు పడుతుండడంతో వరదలు పంటపొలాలను ముంచెత్తుతున్నాయి. వాగులు, తాండూరు డివిజన్లోని కాగ్నా నది ఉధృతంగా ప్రవహిస్తుండగా.. జుంటుపల్లి ప్రాజెక్టు, చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు అలుగు పారుతున్నాయి. ఏకధాటి వర్షాలతో పంటలు దెబ్బతింటుండడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీరు ప్రవహించి పంట పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. కొన్నిచోట్ల వర్షం ధాటికి భూములు కోతకు గురయ్యాయి. వీలైనంత మేరకు పంటల నష్టాన్ని తగ్గించేందుకు వ్యవసాయ అధికారులు సస్యరక్షణ చర్యలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వానలు వెలిసిన వెంటనే పత్తి పంటల్లో నిలిచిన నీటిని తొలగించాలని సూచిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 22,240 ఎకరాలు నీట మునగగా.. 15049 మంది రైతులకు చెందిన మొత్తం 3306 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ వెల్లడించారు.
పరిగి, సెప్టెంబర్ 7 : జిల్లాలో వరదలు ముంచెత్తుతున్నాయి. తాండూరు డివిజన్లోని కాగ్నా నది ఉధృతంగా పారుతున్నది. జుంటుపల్లి ప్రాజెక్టు అలుగుపోస్తున్నది. జిల్లాలో ఐదు రోజులుగా వర్షాలు ఆగడంలేదు. కురుస్తున్న వానలతో రైతుల పరిస్థితి ఆయోమయంగా మారింది. గత నెలలో సకాలంలో వానల్లేక సాగు విస్తీర్ణం తగ్గడంతోపాటు సాగు చేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఏకధాటి వర్షాలతో పంటలు దెబ్బతింటున్నాయి. పత్తి పంట ప్రమాదంలో పడింది. వరి పంటలు నేలవాలాయి. వర్షాలు ఐదు రోజులైనా జోరు తగ్గడం లేదు. శని, ఆదివారాలు భారీ వానలతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెక్ డ్యాంలు నిండి పారుతున్నాయి. చెరువులు, కుంటలు అలుగు పారుతున్నాయి. ఆయా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
పంటలకు నష్టం..
ప్రస్తుత వర్షాలకు జిల్లావ్యాప్తంగా 3306 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. వరి, పత్తి, కంది, ఇతర కూరగాయల పంట పొలాల్లోకి నీళ్లు నిలుస్తున్నాయి. పొలాల్లోకి నీళ్లు పారి ఇసుక మేటలు వేశాయి. కొన్ని చోట్ల పొలాలు కోతకు గురయ్యాయి. 13 మండలాల్లో 5237 మందికి చెందిన 8809 ఎకరాల కంది పంట, 12 మండలాల్లోని 6243 మందికి చెందిన 11,316 ఎకరాల్లో పత్తి, 8 మండలాల్లో 1557 మందికి చెందిన 2270 ఎకరాల పెసర, 6 మండలాల్లో 446 రైతులకు చెందిన 806 ఎకరాల్లో మినుములు, 4 మండలాల్లో 1340 రైతులకు సంబంధించి 1930 ఎకరాల మక్కజొన్న, 3 మండలాల్లో 114 రైతులకు సంబంధించి 185 ఎకరాలు, మరో మండలంలో 112 మంది రైతులకు సంబంధించి 230 ఎకరాల పంటలకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. 15049 రైతులకు చెందిన 3306 ఎకరాల పంటలకు నష్టం వాటిల్లగా.. 22240 ఎకరాలు నీట మునిగాయని జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ వెల్లడించారు.
జిల్లాలో వర్షపాతం నమోదు..
మంగళవారం జిల్లాలోని మర్పల్లిలో 29.4 మి.మీ, మోమిన్‌పేట 23.4, నవాబుపేట 17.4, వికారాబాద్ 9.8, పూడూరు 9.4, పరిగి 5.6, కులకచర్ల 4.6 ,దోమ 5, ధారూరు 10.8, బంట్వారం 16, తాండూరు 14.4, యాలాల 6.2, పెద్దేముల్ 19.2, బషీరాబాద్ 5.2, బొంరాస్‌పేట్ 4.4, కొడంగల్ 2.8, దౌల్తాబాద్ 8.6 మి.మీ చొప్పున వర్షం కురిసింది. అత్యధికంగా మర్పల్లిలో 29.4 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో 19 మండలాలుండగా.. 17 మండలాల్లో అధిక వర్షపాతం నమోదు కాగా.. చౌడాపూర్ మండలంలో సాధారణ వర్షపాతం నమోదు కాగా, పరిగిలో సాధారణ వర్షపాతంకంటే కూడా తక్కువ నమోదైంది. జిల్లాలో ఇప్పటివరకు సాధారణంగా 520 మి.మీ వర్షం కురువాల్సి ఉండగా.. 705.2 మి.మీ వర్షపాతం నమోదైంది.