
పరిగి, జూలై 7: స్థానిక సంస్థలను బలోపేతం చేస్తున్నట్టు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు ప్రతినెల రూ.309కోట్లు సర్కారు విడుదల చేస్తున్నదన్నారు. బుధవారం పరిగి మండలంలోని రాఘవాపూర్‌లో నూతన గ్రామపంచాయతీ భవనం, రంగంపల్లిలో వైకుంఠధామం, గడిసింగాపూర్లో నూతన గ్రామపంచాయతీ భవనం, రైతువేదికలను జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ ప్రతినెల నిధుల విడుదలతో గ్రామాలలో అభివృద్ధి పనులలో వేగం పెరిగిందన్నారు. ప్రతి గ్రామపంచాయతీలో డంపింగ్‌యార్డు, వైకుంఠ ధామం, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశామన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామా ల స్వరూపం మారిందన్నారు. రైతుబంధు పథకం కింద జిల్లాలో 2.49లక్షల మంది రైతులకు రూ. 311 కోట్లు జమ అయ్యాయన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం రైతుబంధు కింద ఇప్పటివరకు రూ.50వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం రూ.4వేల కోట్లు ఖర్చు చేయనున్నట్టు మంత్రి సబితారెడ్డి వివరించారు. కాళేశ్వరం వలె పాలమూర్ ఎత్తిపోతలను పూర్తి చేయడం ద్వారానే తెలంగాణకు పూర్తి సార్థకత లభిస్తుందని సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని తెలిపారు. గోదావరి వలె కృష్ణలో మన నీరు మనకు దక్కేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు.
రాష్ట్రంలో పంటల సాగు మూడింతలు పెరిగిందని, వరి సాగులో తెలంగాణ పంజాబ్‌ను దాటి మొదటి స్థానానికి చేరుకుందన్నారు. ఈ ఏడాది రెండు పంటలు కలిపి రాష్ట్రంలో మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని మంత్రి తెలిపారు. జిల్లాలోని మోమిన్‌పేట్ మండలం అర్కతల సమీపంలో 200 ఎకరాలలో సెజ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిదని, అందులో రైస్‌మిల్లులు, దాల్‌మిల్లులు ఏర్పాటు చేయవచ్చన్నారు. జిల్లాలో వరి సాగు పెరగడం వల్ల డీసీసీబీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణానికి కృషి జరుగుతుందన్నారు. పరిగి ప్రాంతంలోను 20 ఎకరాలలో గోదాముల నిర్మాణానికి ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే 57 ఏళ్లు నిండిన వారికి పెన్షన్లు అందనున్నాయని, 4.5 లక్షల రేషన్‌కార్డులు జారీకి సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందన్నారు. దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు దళిత సాధికారత కింద ఒక్కో కుటుంబానికి రూ.10లక్షలు అందజేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారని మంత్రి చెప్పారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి మాట్లాడుతూ ప్రాధాన్యతా క్రమంలో నిధులు కేటాయించి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో పచ్చదనం పెంపు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. పరిగి నియోజకవర్గంలో 90 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించినట్టు చెప్పారు. గడిసింగాపూర్ చెరువుకు సంబంధించిన పాటు కాలువ నిర్మాణానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా సీనరేజ్ చార్జీలు మం డలాలకు వెంటనే విడుదల చేసేలా చూడాలని ఎంపీపీలు, జడ్పీటీసీలు మంత్రి సబితారెడ్డికి మెమోరాండం అందజేశారు. ఇటీవల మృతిచెందిన రంగంపల్లికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి కుటుంబాన్ని మంత్రి సబితారెడ్డి పరామర్శించారు. పలుచోట్ల చిన్నారులు మంత్రితో కలిసి ఫోటోలు దిగారు. ఆన్లైన్ క్లాసులు ఎలా జరుగు తున్నాయి, అర్థమవుతున్నాయా అని మంత్రి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాలలో జిల్లా కలెక్టర్ పౌసుమిబసు, డీసీసీబీ చైర్మన్ బి.మనోహర్‌రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ, జిల్లా వ్యవసాయాధికారి గోపాల్, ఎంపీపీ కె.అరవిందరావు, జడ్పీటీసీలు కొప్పుల నాగారెడ్డి, రాందాస్‌నాయక్, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్‌రెడ్డి, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు మేడిద రాజేందర్, ఏడీఏ వీరప్ప, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, సీనియర్ నాయకులు బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎ.సురేందర్‌కుమార్, మండల వ్యవసాయాధికారి ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్‌లు జీ.అశోక్‌వర్దన్‌రెడ్డి, నల్క జగన్, లక్ష్మీదేవి, వెంకట్రామకృష్ణారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, ఎంపీటీసీలు కె.వెంకట్రాంరెడ్డి, పద్మమ్మ, నార్మాక్స్ డైరెక్టర్ పి. వెంక ట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.