ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 14 : యాచారం మండలంలోని నందివనపర్తి గ్రామంలోని జ్ఞానసరస్వతి దేవాలయంలో బుధవారం వసంతపంచమిని పురస్కరించుకుని పెద్ద ఎత్తున అక్షరాభ్యాసం చేపట్టారు. ముందుగా సరస్వతి అమ్మవారికి అభిషేకం, అలంకరణ అనంతరం పూజలు చేశారు. విద్యారణ్య భారతిస్వామిజీ ఆధ్వర్యంలో 350మంది చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా నందివనపర్తి పదోతరగతి విద్యార్థులతో సరస్వతి హోమం నిర్వహించారు. విద్యార్థుల సంపూర్ణ వికాసాన్ని కాంక్షిస్తూ సంకల్పం ధ్వజావిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు.
అనంతరం నందివనపర్తి ప్రభుత్వ పాఠశాల పదోతరగతి విద్యార్థులతో పల్లకిసేవా ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యారణ్య భారతిస్వామిజీ మాట్లాడుతూ.. మనకి ఎన్ని మంచిగుణాలున్నా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి ఉండాలన్నారు. ఈ రెండులేకపోతే ముందుకు వెళ్లలేమన్నారు. విద్యార్థులకు జ్ఞాపకశక్తి పెరగటానికి ఈ సందర్భంగా ఆయన పలు మెళకువలను తెలిపారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు సదావెంకట్రెడ్డి, సమన్వయ మండలి సభ్యులు గణేశ్, రాఘవేంద్రశర్మ, వెంకట్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, శివకుమార్, నిఖిల్‌కుమార్, సంతోశ్‌కుమార్, రుద్రమ్మ, దీపిక, అనురాధ, జలేందర్ ఉన్నారు.