షాబాద్, జూలై 3 : రైతులు తమ పశువుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలని షాబాద్ మండల పశువైద్యాధికారి డాక్టర్ స్రవంతి అన్నారు. గురువారం షాబాద్ మండల పరిధిలోని సర్దార్ నగర్, ఆస్పల్లిగూడ గ్రామాల్లో లేగ దూడలకు లంపిస్కిన్ వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పశువులకు వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లేగదూడలకు లంపిస్కిన్ వ్యాధి నివారణకు టీకాలు వేయడం జరుగుతుందన్నారు. రైతులు ఆయా గ్రామాల్లో అందుబాటులో ఉండి తమ పశువులకు టీకాలు వేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది బలరాం, అంజయ్య, శ్రీకాంత్, రాణి, రైతులు తదితరులున్నారు.