Cattles | యాచారం, జులై 16 : వర్షాకాలంలో చిరుజల్లులు, చిత్తడి నేలలు పాడి పశువుల్లో పలు రోగాలకు కారణమవుతాయి. కలుషిత నీరు, ముసిరే వర్షం, ఈగలు, దోమల వల్ల పశువులు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని యాచారం మండలం మేడిపల్లి పశువైద్యాధికారి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. వానాకాలంలో పశుపోషకులు కొంతమేర జాగ్రత్తలు పాటించడంతో మూగజీవాలు ఆరోగ్యంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. పశువుల సీజనల్ వ్యాధులు, నివారణ చర్యలు, జాగ్రత్తలపై ఆయన పశు పెంపకం దారులకు సూచనలు అందజేశారు.
పశువులకు సోకే వ్యాధులు
వర్షాకాలంలో పశువులకు గాలికుంటువ్యాధి, గొంతువాపు వ్యాధి, నీలినాలుక, పీపీఆర్, అమ్మోరు, చిటుకు వ్యాధులు ప్రధానంగా సోకుతుంటాయి.
గాలికుంటువ్యాధి:
ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలకు గాలికుం టువ్యాధి సోకుతుంది. దీని లక్షణం పశువుల నోటి నుంచి చొంగ కారుతుంది. పశువులకు ఉష్ణోగ్రత 104 నుంచి 106 డిగ్రీల వరకు ఉంటుంది. నోటిలో పుండ్లు ఏర్పడి మేత సరిగ్గా తినక నీరసంగా ఉంటాయి. పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది. దూడల్లో ఇలాంటి లక్షణాలు కనిపించగానే వెంటనే పశు వైద్యులను సంప్రదించాలి.
నివారణ చర్యలు:
వ్యాధి నిరోధక టీకాను 6 నుంచి 8 వారాల పైబడిన దూడలకు మొదటి మోతాదు వేయాలి. 4 నుంచి 6 నెలల వయసు కలిగిన దూడలకు బూస్టర్ మోతాదు ఇప్పించాలి. టీకాను ప్రతీ ఏడాది ఇప్పిస్తే వ్యాధిని నివారించేందుకు అవకాశం ఉంటుంది. వ్యాధి సోకిన పశువును మంద నుంచి వేరు చేయాలని, పశువుల కొట్టంతోపాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి.
నీలి నాలుక వ్యాధి:
వ్యాధి సోకిన సమయంలో జ్వరం, నోటిలో పుండ్లు, నావికారంధ్రం, కాళ్ల గిట్టలు, నాలుక భాగంలో శోధం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. పశువుల నాలుక వాచిపోయి నీలిరంగుగా మారుతుంది. న్యూమోనియా లక్షణాలు కనిపిస్తూ శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. ముక్కు నుంచి జిగురు లాంటి ద్రవం కారుతుంది. కాలిగిట్టల దగ్గర ఎర్రగా వాచడం, మెడ భాగంలో వాపుగా ఉండడం, ముక్కు, కంటి, నోటి నుంచి తరచూ లాలజలం కారుతుంది.
నివారణ చర్యలు:
పశువులను వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లి చికిత్స అందించాలి. ఐదు రోజులపాటు యాంటీ బయాటిక్ టీకాలు వేయించాలి. సులభంగా జీర్ణమయ్యే గంజి, ఓఆర్ఎస్ వంటి ద్రావణాన్ని అందించాలి. దోమలు రాకుండా తెరలు వాడాలి.
అమ్మోరు:
మేకలు, గొర్రెల్లో ప్రాణాంతకమైన అంటువ్యాధి. జ్వరం, చర్మంపై బొబ్బలు ఏర్పడి శరీరం అంతా వ్యాపిస్తుంది. చూడి గొర్రెల్లో గర్భస్రావం అవుతుంది. ఆహారం, నీరు తీసుకోకుండా నీరసించిపోతాయి.
నివారణ:
వ్యాధి సోకిన వాటిని మంద నుంచి వేరుచేయాలి. మూడు నెలలు నిండిన గొర్రెలకు షీప్ప్యక్స్ వ్యాక్సిన్ ఇస్తే వ్యాధి రాకుండా నివారించవచ్చు. ఒకసారి టీకా ఇప్పించడంతో మూడేళ్లవరకు వ్యాధి రాకుండా ఉంటుంది.
చిటుకు వ్యాధి:
మేకలు గొర్రెల్లో వచ్చే ప్రాణాంతకమైన వ్యాధి చిటుకు. ఏడాదిలోపు గొర్రెలకు సోకుతుంది. విరోచనాలు, కండరాలు కొట్టుకోవడం, శ్వాసకోశ ఇబ్బందులు కనిపిస్తాయి.
నివారణ చర్యలు:
వైద్యుల సూచనలు పాటిస్తూ ఎంటెరోటాక్సెమియా వ్యాక్సిన్ను సమయానుకూలంగా వేయించాలి.
జాగ్రత్తలు తప్పనిసరి: కిరణ్ కుమార్ రెడ్డి
పశువుల పెంపకంలో రైతులు జాగ్రత్తలు పాటిస్తూ పశుపోషణకు కృషి చేయాలి. సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు టీకాలును ఇప్పించాలి. వైద్యుల సూచనలు పాటిస్తూ పశువుల ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకోవాలి. మూగజీవాల కొట్టాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి.