బొంరాస్‌పేట, సెప్టెంబర్ 2 : మండలంలోని ప్రభుత్వ శాఖల్లో ప్రధాన పోస్టులు ఖాళీగా ఉండడంతో పాలనలో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోస్టులు భర్తీ కాకపోవడంతో సమయానికి పనులు జరుగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక, పంచాయతీరాజ్ శాఖ, వైద్యశాఖ, రెవెన్యూ ఇలా ప్రధాన శాఖల్లో అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఏవోతో పాటు మూడు ఏఈవో పోస్టులు ఖాళీ..
మండలంలో వ్యవసాయ అధికారి పోస్టు ఖాళీగా ఉన్నది. ఇటీవల ఏవోతో పాటు దుద్యాల, మెట్లకుంట, నాగిరెడ్డిపల్లి క్లస్టర్ల ఏఈవోలు బదిలీపై వెళ్లారు. వారి స్థానంలో కొత్త వారిని అధికారులు నియమించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం రుణమాఫీ జరుగని రైతులు పట్టా పాసు పుస్తకాలు పట్టుకుని రైతు వేదికల చుట్టూ తిరుగుతున్నారు. ఏవోతో పాటు ఏఈవో పోస్టులు ఖాళీగా ఉండడంతో రైతులకు అధికారులు అందుబాటులో ఉండడం లేదు. ఉన్న ముగ్గురు ఏఈవోలకు ఇన్చార్జి బాధ్యతలను అప్పగించారు.
ఎంపీడీవో పోస్టు ఖాళీ..
మండల పరిషత్ అభివృద్ధి అధికారి పోస్టు మూడు నెలల నుంచి ఖాళీగా ఉన్నది. రెగ్యులర్ ఎంపీడీవో మే నెలలో పదవీ విరమణ చేశారు. దీంతో సూపరింటెండెంట్ వెంకన్గౌడ్కు ఇన్చార్జి ఎంపీడీవో బాధ్యతలను అప్పగించారు. జూనియర్ అసిస్టెంట్ పంచాయతీరాజ్ కమిషనరేట్‌లో డిప్యుటేషన్‌పై పని చేస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ పోస్టు రెండు నెలల నుంచి ఖాళీగా ఉన్నది. తహసీల్దార్ సెలవు పెడితే రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో పాటు ఇతర పనుల కోసం వచ్చే ప్రజలకు ఇబ్బందులు తప్పవు. సీనియర్ అసిస్టెంట్‌ను దుద్యాల మండలానికి డిప్యుటేషన్‌పై పంపడంతో ఆ పోస్టు కూడా ఖాళీగా ఉన్నది.
మూడు మండలాలకు ఇన్చార్జి ఎంఈవోనే దిక్కు..
విద్యాశాఖలో రెగ్యులర్ ఎంఈవో పోస్టు చాలా ఏండ్ల నుంచి ఖాళీగా ఉన్నది. కొడంగల్, బొంరాస్‌పేట, దుద్యాల మూడు మండలాలకు కలిపి ఒక్కరే ఇన్చార్జి ఎంఈవోగా కొనసాగుతున్నారు. దీంతో మూడు మండలాల పరిధిలోని పాఠశాలలను పర్యవేక్షణ చేయడం చాలా కష్టంగా ఉన్నది. ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలను ఏర్పాటు చేసి పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పనులను, పాఠశాలలను పర్యవేక్షించడానికి ఒక్కరే ఎంఈవో కావడంతో విద్యాభివృద్ధి కుంటుపడడంతో పాటు పనులు సవ్యంగా జరుగడం లేదు.
ఖాళీగా పశువైద్యాధికారి..
పశువైద్యాధికారి పోస్టు కూడా ఖాళీగా ఉన్నది. దీంతో మూగ జీవాలకు సకాలంలో వైద్యం అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గౌరారం, దుద్యాల, తుంకిమెట్ల పశువైద్య కేంద్రాల్లో జేవీవో పోస్టులు ఖాళీగా ఉండడంతో వాటి పరిధిలోని మూగ జీవాలకు సకాలంలో వైద్యం అందడం లేదు. జిల్లా ఉన్నతాధికారులు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.