రంగారెడ్డి, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : మహిళల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్ర మహిళా కమిషన్ నిరంతరం కృషి చేస్తున్నదని చైర్పర్సన్ వి.సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. చైర్పర్సన్ నేతృత్వంలో సభ్యులు షహీన్, రేవతి, సూదం లక్ష్మి, పద్మ, ఈశ్వరీబాయి, ఉమాదేవిలతో కూడిన రాష్ట్ర మహిళా కమిషన్ బృందం బుధవారం రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అన్ని శాఖల జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం, సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. మహిళల హక్కులకు భంగం కలిగినపుడు బాధితులకు తగిన న్యాయం చేస్తూ, వారికి అండగా నిలుస్తున్నామని పేర్కొన్నారు. రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులను వినియోగించుకుంటూ నేటి సమాజంలో బాలికలు, యువతులు ఉన్నత చదువులు అభ్యసిస్తూ అన్ని రంగాల్లో పురుషులకు సమానంగా రాణిస్తున్నారని తెలిపారు. అయినప్పటికీ ఇంకనూ అక్కడక్కడ మహిళల పట్ల వివక్షతో కూడిన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వెలిబుచ్చారు. మహిళలు రాజ్యాంగం ద్వారా కల్పించబడిన తమ హక్కుల గురించి పూర్తి అవగాహన ఏర్పర్చుకోవాలని సూచించారు.
మహిళల సంక్షేమం కోసం నెలకొల్పబడిన సంఘాలు, మహిళా చట్టాల గురించి సదస్సుల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహనను పెంపొందించేందుకు కృషి చేయాలని సునీతా లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. నిత్యం ప్రజలతో మమేకమై పని చేసే వివిధ శాఖల ఉద్యోగులు సిబ్బంది కూడా మహిళల్లో వారి కోసం ఉద్దేశించిన చట్టాల పట్ల అవగాహన పెంపొందించేందుకు చొరవ చూపాలన్నారు. బాలికల పట్ల వివక్షతను కనబరచకుండా వారికి నచ్చిన రంగాల్లో రాణించేలా ప్రోత్సహించాలని సూచించారు. కాగా, మహిళల రక్షణ, వారి భద్రత కోసం ఉద్దేశించిన చట్టాలను తప్పుడు పద్ధతుల్లో వినియోగించుకునే ప్రయత్నాలు చేయకూడదని చైర్పర్సన్ హితవు పలికారు. కాలేజీల వద్ద, పబ్లిక్ ప్రాంతాల్లో మహిళా హెల్ప్‌లైన్ ట్రోల్‌ఫ్రీ నెం: 181/100 ఏర్పాటు చేయాలని, అదే విధంగా ప్రజలకు సఖి సెంటర్లపై అవగాహన కల్పించాలని సూచించారు. మహిళా ఉద్యోగులు ఎక్కువగా పని చేసే శాఖలు మహిళల రక్షణకై జిల్లా అధికారులతో కమిటీలను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా చైర్పర్సన్ సూచించారు.
కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ.. మహిళలు, బాలల సంరక్షణ కోసం రాజ్యాంగంలోని చట్టాలను అనుసరిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల చర్యలు చేపడుతున్నాయని తెలిపారు. క్షేత్రస్థాయిలో వీటిని పరిపూర్ణంగా అమలు జరిగేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్నారు. అప్పుడే ప్రభుత్వాలు చేపట్టే చర్యలు పూర్తి స్థాయిలో సత్ఫలితాలు ఇస్తాయని పేర్కొన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని మహిళలు, బాలల కోసం ఉద్దేశించిన చట్టాలు కింది స్థాయి వరకు కూడా సమర్థవంతంగా అమలవుతున్నాయా? లేదా? అన్నది అధికారులు మొదలుకొని అంగన్వాడీ కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ పరిశీలించాలని సూచించారు. ఎక్కడైనా అమలు తీరులో లోపం ఉంటే అధికారుల దృష్టికి తేవాలన్నారు. కార్యక్రమంలో డీసీపీ సాయిశ్రీ, అడ్వకేట్ మంజూష, జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, జిల్లా సంక్షేమ శాఖ అధికారి మోతి, ఆర్డీవోలు, వివిధ శాఖల అధికారులతో పాటు సీడీపీవోలు, ఉపాధ్యాయులు, కార్యదర్శులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.