కేశంపేట, సెప్టెంబర్ 24 : కేశంపేట పీఏసీఎస్ పరిధిలో అందజేస్తున్న యూరియా అరకొరగా పంపిణీ అవుతుండటంతో రైతన్నలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా నిల్వ కేంద్రానికి బుధవారం అన్నదాతలు, మహిళా రైతులు పెద్ద సంఖ్యలో రావడంతో గందరగోళ పరిస్థితి నెలకొన్నది. అన్నదాతల రాకను గమనించిన పీఏసీఎస్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందజేశారు. కొనుగోలు కేంద్రం వద్ద పోలీసు పహారాలో రైతులకు టోకెన్లతోపాటు యూరియాను అందజేశారు. అందని అన్నదాతలు నిరాశతో వెనుదిరిగారు.
పంటలు వేసి రెండు నెలలైనా..
యాలాల : మండల కేంద్రంలోని పీఏసీఎస్ కేంద్రం వద్ద ఉదయం నుంచే చెప్పులు క్యూలో పెట్టి పడిగాపులు కాసారు. పంటలు వేసి రెండు నెలలైనా యూరియా కోసం ఇంకా ఎదురుచూపులేనా అంటూ రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఎరువులు వస్తాయో సమాచారం లేక మబ్బుల వచ్చి తిండి, నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని అన్నదాతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
క్యూలో అన్నదాతలు
షాద్నగర్టౌన్ : పట్టణంలోని ఆగ్రోరైతు సేవా కేంద్రం వద్ద రైతులు తెల్లవారుజాము నుంచే యూరియా కోసం క్యూలో నిలబడగా.. పోలీసు పహారాలో పంపిణీ చేశారు. పంటలను సాగు చేసి యూరియా కోసం తిప్పలు పడుతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి నిలుచున్నా రెండు బస్తాలను మాత్రమే ఇస్తున్నారని వాపోతున్నారు. యూరియా ఇంకా ఎన్ని రోజులు ఎదురుచూడాలని ప్రశ్నిస్తున్నారు. సరిపడా ఎరువులను పంపిణీ చేయాలని అన్నదాతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
రైతుల పాట్లు..
వికారాబాద్ : వికారాబాద్ పీఏసీఎస్ కార్యాలయం వద్ద తెల్లవారుజాము నుంచి దాదాపు 100 మంది వరకు రైతులు యూరియా కోసం బారులు తీరారు. సరిపడు ఎరువులు దొరకకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. వ్యవసాయ పనులు వదులుకొని గంటల తరబడి క్యూలో ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరిపడ యూరియా అందించి తమ కష్టాలను తీర్చాలని పేర్కొంటున్నారు.
తప్పని కష్టాలు
తాండూరు రూరల్ : తాండూరు మండలం ఎల్మకన్నె సొసైటీ కార్యాలయం వద్ద ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సీఈవో శ్రీనివాస్ రైతులకు టోకెన్లు జారీ చేశారు. మధ్యాహ్నం తర్వాత గోదాం వద్ద అన్నదాతలకు యూరియా సరఫరా చేశారు. ఎక్కువ మంది రైతులకు యూరియా అందలేదు. కేవలం రెండు బస్తాలు ఇవ్వడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండు రోజులుగా వస్తున్నా..
నాలుగు ఎకరాల్లో పంట సాగు చేశా. మా గ్రామం మండల కేంద్రానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రెండు రోజులుగా యూరియా కోసం వస్తున్నా. నేటికీ టోకెన్ ఇవ్వలేదు. ఉదయం నుంచి కనీసం మంచినీరు తాగకుండా క్యూలో నిలబడినా ఎరువులు ఇచ్చే దిక్కులేదు. రెండు బస్తాలు ఇస్తే సరిపోదు. పంట మొత్తానికి అవసరమయ్యే యూరియాను అధికారులు అందజేయాలి.
– బండ సత్తయ్య, రైతు, నిర్దవెల్లి, కేశంపేట
తిండి తినకుండా వచ్చా..
నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న, ఎకరం పొలంలో వరి సాగు చేశా. పంట చేతికి రావాలంటే యూరియా తప్పనిసరిగా వేయాలి. ఉదయం తిండి తినకుండా ఎరువుల కోసం వచ్చాను. మధ్యాహ్న సమయం దాటినా యూరియా అందలేదు. ఒక వ్యక్తికి కేవలం రెండు బస్తాలు మాత్రమే ఇస్తామని చెబుతున్నారు. పెద్ద మొత్తంలో సాగు చేసిన రైతుల పరిస్థితి అర్థంకావడంలేదు. అనారోగ్యం బారిన పడిన అన్నదాతలు సైతం తమ పంటలను కాపాడుకునేందుకు ఎరువుల కోసం వస్తున్నారు. అవసరమైనంత యూరియాను అందజేస్తే బాగుంటుంది.
– శంకరయ్య, రైతు, కాకునూరు, కేశంపేట
క్లస్టర్ల పరిధిలో పంపిణీ చేయాలి
మనిషికి రెండు బస్తాలు ఇస్తామని చెబుతున్నారు. నాకు 20 ఎకరాల భూమి ఉన్నది. రెండు బస్తాలు ఇస్తే ఎలా సరిపోతుంది. చాలామందికి బీపీ, షుగర్ ఉన్నది. తిండిలేక క్యూలో నిలబడిన రైతులకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు. ప్రభుత్వం క్లస్టర్లను ప్రాతిపదికగా తీసుకొని యూరియా పంపిణీ చేయాలి. మండల కేంద్రానికి, కొత్తపేటకు వెళ్లేందుకు అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లోని రైతు వేదికల్లో ఎరువుల బస్తాలను డంప్ చేసి ఏఈవోలు, పీఏసీఎస్ సమక్షంలో ఆ క్లస్టర్ పరిధిలోని రైతులకు పట్టాదారు పాసుపుస్తకం ఆధారంగా అందజేయాలి.
– జగన్మోహన్రెడ్డి, కొండారెడ్డిపల్లి
రాజకీయాలు మానుకోవాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తూ యూరియాను అందజేయాలి. రాష్ర్టానికి ప్రణాళిక లేదని కేంద్రం, కేంద్రం పై రాష్ట్రం, ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అదునుదాటితే ఎరువులు వేసినా ఫలితం ఉండదు. ఆయా ప్రభుత్వాలు స్పందించి రైతులకు సరిపడా యూరియాను అందజేసి పంటలను కాపాడాలి. అన్నం పెట్టే రైతన్న ఎరువుల కోసం రోడ్లపై నిలబడాల్సి రావడం దురదృష్టకరం. రైతుల విషయమై ఆయా రాజకీయ పార్టీల నేతలు స్పందించి పూర్తిస్థాయిలో యూరియాను అందజేసేలా కృషి చేయాలి.
– హుమ్లా, రైతు, దేవునిగుడితండా