మియాపూర్ ,మే 18 : మహిళలు తమ ఆరోగ్యం పై మరింత శ్రద్ధ వహించాలని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పిలుపునిచ్చారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటూ అనారోగ్యాల బారిన పడకుండా చూసుకోవాలని సూచించారు. మహిళా ఆరోగ్య వికాస్ తరంగిణి వింగ్ ఆధ్వర్యంలో గౌతమి విద్యా క్షేత్ర పాఠశాలలో ఆదివారం ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ ఇటీవలి కాలంలో మహిళలు క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నారని ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తగు సమయంలో గుర్తించలేక పోతుండడంతో ప్రమాదం బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎప్పటికప్పుడు క్యాన్సర్ నిర్ధారణ వైద్య పరీక్షలు చేయించుకొని వాటి బారిన పడకుండా ఉండాలని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ కోరారు. ఈ వ్యాధిపై మహిళలలో మరింత అవగాహన కల్పించేలా స్వచ్ఛంద సంస్థల కృషి అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో విమలాదేవి, సుగుణ, మాధవి ప్రవీణ, మోహిని, పాపిరెడ్డి, చంద్ర ఓబుల్ రెడ్డి, సురేష్ కుమార్ రెడ్డి, అజయ్ కుమార్ రెడ్డి, శివ, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.