వికారాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. గత రెండేండ్లుగా ఉపాధి హామీ పథకంలో గతంలో ఎన్నడూలేని కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ప్రభుత్వ సంస్థలన్నింటినీ అదానీ వంటి పెట్టుబడుదారులకు అప్పగించేలా మోదీ ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తున్నది. కరువును అధిగమించేందుకు తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకానికి మాత్రం తూట్లు పొడుస్తున్నది.
గత ఆర్థిక సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విధానాలతో కూలీలకు ఉపాధి హామీ పనులు దూరమయ్యాయి. ఉపాధి హామీ పనులను భారీగా తగ్గించిన కేంద్రం వేల కూలీల కుటుంబాల కడుపు కొడుతున్నది. ఎన్నో కుటుంబాలను ఉపాధి హామీ పనులకు కేంద్ర ప్రభుత్వం దూరం చేసింది. రోజువారీ కూలీ డబ్బులు అందక పలువురు కూలీలు ఉపవాసం ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నది. గత మూడు నెలలుగా కూలీ డబ్బులు అందలేదు.
మే నెల నుంచి కూలీ డబ్బులు పెండింగ్‌లో ఉండడం బాధాకరం. గత మూడు నెలలకుగాను రూ.58.62 కోట్ల కూలీ డబ్బులు పెండింగ్‌లో ఉన్నాయి. ఉపాధి హామీకి నిధులు విడుదల చేస్తున్నదన్న ఆశతో ఉన్న కూలీలను కేంద్ర ప్రభుత్వం నట్టేటముంచింది. ఈ ఆర్థిక సంవత్సరం 59.85 లక్షల పని దినాలను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటి వరకు 57.53 లక్షల పనిదినాలు పూర్తయ్యాయి. మరోవైపు జిల్లావ్యాప్తంగా 1,85,107 జాబ్ కార్డులుండగా, 3,79,869 మంది కూలీలు ఉన్నారు. 1,31,603 మంది యాక్టివ్ కూలీలు ఉన్నారు. ఉపాధి హామీ కూలీలకు రోజుకు రూ.300 చెల్లిస్తున్నారు.
మూడేండ్లలో 44 లక్షల పనిదినాలు తగ్గింపు..
పేదలకు ఉపాధి హామీ పనులను దూరం చేసే విధంగా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. లక్షల మంది పేద కుటుంబాల కడుపు నింపుతున్న ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నీరుగార్చి పథకాన్ని నిలిపివేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగానే తప్పుడు నివేదికలు తెప్పించుకొని అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయంటూ ప్రచారం చేసి పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నది. అందుకు అనుగుణంగానే గత రెండేండ్లుగా ఉపాధి హామీ పని దినాలను భారీగా తగ్గించింది.
కేవలం మూడేండ్లలోనే 44 లక్షల పని దినాలను జిల్లాలో తగ్గించారంటే ఉపాధి హామీ పథకంపై మోదీ ప్రభుత్వం ఏ స్థాయిలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదో అర్థం చేసుకోవచ్చు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 1.03 లక్షల పనిదినాలను కల్పించగా, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 31.41 లక్షల పనిదినాలను తగ్గిస్తూ 71.58 లక్షల పనిదినాలను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తదనంతరం 2023-24 ఆర్థిక సంవత్సరంలో మరో 10 లక్షల మేర పనిదినాలను తగ్గిస్తూ 62 లక్షల పనిదినాలను కల్పించాలని నిర్ణయించింది.
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరో 2.98 లక్షల పనిదినాలను తగ్గిస్తూ 59.85 లక్షల పనిదినాలుగా నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ఎన్ఆర్ఈజీఎస్ సాఫ్ట్-ఎన్ఐసీ సాఫ్ట్‌వేర్‌తో జిల్లాలోని లక్షల కుటుంబాలకు ఉపాధి హామీ పనులు దూరమయ్యాయి. కొత్త సాఫ్ట్వేర్ విధానంతో కూలీలు తప్పనిసరిగా ఉదయం, సాయంత్రం పనులకు తప్పనిసరిగా హాజరుకావాలని షరతులను విధించింది. కూలీలు చేస్తున్న పనులకు సంబంధించి ఉదయం 11 గంటల్లోపు ఒక ఫొటో, సాయంత్రం 2 గంటల తర్వాత రెండో ఫొటో తప్పనిసరిగా తీయడంతోపాటు అప్లోడ్ చేస్తున్నారు.
ఒక గ్రామంలో చేపడుతున్న ఉపాధి హామీ పనులకు సంబంధించి ఒక పని పూర్తైన తర్వాతనే మరొక పని చేపట్టాలని నిబంధన విధించారు. దీంతో గతంలో మాదిరిగా కాకుండా పనులు చాలా ఆలస్యమవుతున్నాయి. నిత్యం చేపడుతున్న పనులను వెంటనే యాప్‌లో పొందుపర్చాలనే నిబంధనలతో క్షేత్రస్థాయిలో సిగ్నల్ లేకపోవడంతో అప్లోడ్ చేయడం ఇబ్బందిగా మారి పనుల్లో కూడా జాప్యం జరుగుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ఏటా ప్రతి కుటుంబానికీ వంద రోజుల పనిని కల్పించడమే లక్ష్యంగా పని చేస్తుంటే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో ఈ ఆర్థిక సంవత్సరం వేల కుటుంబాలకు ఉపాధి హామీ పనులు దూరమయ్యాయి. వికారాబాద్ జిల్లావ్యాప్తంగా రెండేండ్ల కింద 19,998 కుటుంబాలకు వంద రోజులపాటు పనులను కల్పించగా, గత ఆర్థిక సంవత్సరం కేవలం 9200 కుటుంబాలకు మాత్రమే వంద రోజుల పనులను కల్పించారు. ఈ ఆర్థిక సంవత్సరం 2948 కుటుంబాలకు మాత్రమే వంద రోజుల పనిని కల్పించడం విడ్డూరం.
రెండు నెలలైనా డబ్బులు రాలేదు..
రెండు నెలల కిందట ఉపాధి హామీ పనులకు వెళ్లాం. అడవిలో నీటి నిల్వ కోసం, మొక్కలు నాటడానికి, చెరువులో ఒండ్రుమట్టి తొలగించే పనులు చేశాం. ఇంత వరకు కూలీ డబ్బులు రాలేదు. అధికారులను అడిగితే వస్తే ఖాతాలో జమ చేస్తామని చెబుతున్నారు. రోజూ కూలీ పనులు చేసుకుంటేనే కాలం గడుస్తున్నది. చేసిన పనికి నెలలకొద్దీ కూలీ రాకుంటే ఎలా బతకాలి.
– పల్లె రాంరెడ్డి, బొంరాస్‌పేట
వారానికోసారి ఇస్తే బాగుంటుంది..
ఉపాధి హామీ పనులు చేస్తే కూలీ తొందరగా ఇవ్వడం లేదు. పేద కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. రెండు నెలల కిందట ఉపాధి హామీ పనులకు వెళ్లా. నాలుగు వారాల కూలీ రావాలి. ఎప్పుడు అడిగినా త్వరలోనే వస్తుందని చెబుతున్నారు. చేసిన పనికి వారం రోజులకు ఒకసారి అయినా కూలీ ఇస్తే బాగుంటుంది. నెలల పాటు కూలీ రాకుంటే ఎట్లా గడపాలి.
– తుల్జానాయక్, గాజులకుంట తండా