జిల్లాలో ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీకి అడ్డూ అదుపులేకుండా పోయింది. వ్యాపార దోరణితో యాజమాన్యాలు వ్యవహరిస్తుండడంతో సామాన్యుడికి ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారుతున్నది. ఎంతో కష్టపడి సంపాదించినదంతా పిల్లల చదువునకే ఖర్చు అవుతుండడంతో పేద, మధ్య తరగతి వారు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ప్రైవేటు కార్పొరేటు విద్యా సంస్థల్లోనే చదివించాలంటేనే జంకుతున్నారు. విద్యను వ్యాపారంగా మార్చిన ప్రైవేటు విద్యా సంస్థలు ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తున్నాయి. తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చదివించాలనే తల్లిదండ్రుల ఆకాంక్షను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. పాఠశాలల్లో ఫీజులకు తోడు యూనిఫామ్‌లు, పుక్తకాలు, నోటుబుక్కులు, బస్సు ఫీజులు అంటూ వసూలు చేస్తున్నారు. విద్యా సంస్థలు ప్రారంభం అవుతుందంటే చాలు తల్లిదండ్రులు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. కొంత మంది వడ్డీలకు డబ్బులు తీసుకొచ్చి పిల్లలను చదివిస్తూ అప్పుల పాలవుతున్నారు.
– రంగారెడ్డి, మే 16 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు విద్యను వ్యాపారంగా మలిచి యథేచ్చగా డొనేషన్లు, ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఫీజుల నియంత్రణ పాటించాలని, అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించినా పట్టించుకోవడం లేదు. మరోవైపు లక్షల రూపాయల డొనేషన్లు తీసుకుంటున్నాయి. విద్యహక్కు చ ట్టం ప్రకారం పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలను విక్రయించరాదని నిబంధనలు ఉన్నాయి. అనేక పాఠశాలలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి పాఠ్యపుస్తకాలను విక్రయిస్తున్నా రు.
ప్యాకేజీ రూపంలో ఎల్కేజీ నుంచి యూకేజీ వరకు పాఠ్యపుస్తకాలకు రూ.5వేలు, ఆ పై తరగతులకు రూ.15 వేల చొప్పున వసూలు చేస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో జరుగుతున్న దోపిడీని అరికట్టడం లేదని సర్వత్రా ఆరోపణలొస్తున్నాయి. శివారులోని శంకర్పల్లి, మొయినాబాద్, శంషాబాద్, రాజేంద్రనగర్, తుక్కుగూడ, ఆదిబట్ల, ఇబ్రహీంపట్నం, తుర్కయంజాల్, పెద్దఅంబర్‌పేట, ఆమనగల్లు తదితర మున్సిపాలిటీల్లో విద్యా వ్యాపారం జోరుగా సాగుతున్నది.
విస్తరిస్తున్న కాలనీలకు అనుగుణంగా కొత్త పాఠశాలలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. కొత్త పాఠశాలల్లో కార్పోరేట్ విద్యనందిస్తామని విద్యార్థులను ప్రలోభాలకు గురిచేస్తూ ఫీజులు, డొనేషన్లు, పుస్తకాలు, డ్రెస్సు లు, ట్రాన్స్ఫోర్టుల పేరుతో ఒకొక్కరి నుంచి రూ.80వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. ్రప్రైవేటు విద్యావ్యాపారం యథేచ్చగా సాగుతున్నప్పటికీ అడ్డుకట్ట వేయ డం లేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.
జిల్లా వ్యాప్తంగా 1500లకు పైగా ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో టాలెంట్, టెక్నో, యూటెక్నో, డీజీ, ఒలంపియా, ఐఐటీ, జేఈ, మాడల్ స్కూల్స్, కంప్యూటర్, స్పోర్ట్స్, డిజిటల్ తదితర ఆకర్షణీయమైన కోర్సుల పేర్లు చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. యాజమాన్యాలు నిర్ణయించిన మేరకే ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
పల్లెల నుంచి పట్టణ ప్రాంతాలకు..
జిల్లాలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన అనేక మంది తమ పిల్లలను చదివించేందుకు ఇబ్రహీంపట్నం, బొంగుళూరు, తుర్కయాంజాల్, రాగన్నగూడ, మన్నెగూడ, తుక్కుగూడ, చేవెళ్ల, పెద్దఅంబర్‌పేట, హయత్‌నగర్, ఎల్బీ నగర్, బీఎన్ రెడ్డి తదితర ప్రాంతాల్లో ఇండ్లను అద్దెకు తీసుకుని తమ పిల్లలను చదివిస్తున్నారు. ఇటీవల మన్నెగూడ, రాగన్నగూడ, బొంగుళూరు, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రైవేటు పాఠశాలలు ఏర్పాటయ్యాయి.
ఈ పా ఠశాలల్లో చదివించాలనే ఆసక్తితో తల్లిదండ్రులు ముందుకొస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని ఆయా పాఠశాలల యాజమాన్యాలు డొనేషన్లు వసూళ్లతో పాటు ఫీజులు కూడా పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నారు. ఈ ప్రాంతంలోని పాఠశాలల్లో ఎల్కేజీ నుంచి పదో తరగతి వరకు లక్షల రూపాయల్లో సంవత్సరానికి వసూలు చేస్తున్నారు. వీటికి తోడు ఇబ్రహీంపట్నం నుంచి మన్నెగూడ, రాగన్నగూడ, తుర్కయాంజాల్ బస్సు సౌకర్యం కోసం రూ.10 వేల నుం చి రూ.20 వేట వరకు వసూలు చేస్తున్నారు. విద్యావ్యాపారాన్ని అరికట్టడంలో విద్యాశాఖ అదికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
అంతంత మాత్రంగానే వసతులు..
రంగారెడ్డి జిల్లాలోని అనేక ప్రైవేటు పాఠశాలల్లో సరైన వసతులు కల్పించడం లేదు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉండడం లేదు. ఒక్కో తరగతి గదిలో 60 నుంచి 80 మం ది వరకు విద్యార్థులను కూర్చోబెడుతున్నారు. సరైన ఆటస్థలాలు ఉండడంలేదు. అద్దె భవనాల్లో పాఠశాలలు నిర్వహిస్తున్నారు. తక్కువ వేతనాలకు అనుభవం లేని ఉపాద్యాయులను నియమించి పాఠశాలలను కొనసాగిస్తున్నారు. అనేక ప్రైవేటు పాఠశాలలు అడ్మిషన్ల సమయంలో గ్రామా ల్లో పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహించి విద్యార్థుల తల్లిదండ్రులను ప్రలోభాలకు గురిచేస్తూ అడ్మిషన్లు చేసుకుంటున్నారు. మరోవైపు అనుమతి లేకుండా కూడా ప్రైవేటు పాఠశాలలను కొనసాగిస్తున్నారు. పాఠశాలల్లో వసతులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు తదితర వాటిపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇంజినీరింగ్ కళాశాలలో ఊపందుకున్న సీట్ల విక్రయాలు..
జిల్లా పరిధిలో ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్ల విక్రయాలు ఊపందుకున్నాయి. ఎంసెట్ కౌన్సెలింగ్ వెలువడిన వెంటనే సీట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు వందకు పైగా ఇంజినీరింగ్ కళాశాలలున్నాయి. వీటిలో మేనేజ్మెంట్ కోటా సీట్ల విక్రయాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. సీఎస్సీ, ఈసీ తదితర సీట్లకు రూ.10 లక్షల వరకు వసూలు చేస్తుస్తున్నాయి. ఐటీ, ఈఈఈ తదితర సీట్లకు పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నాయి. పేరున్న కళాశాలల్లో విద్యార్థులు సీట్ల కోసం పోటీ పడుతుండటంతో మేనేజ్మెంట్లు కూడా అందుకనుగుణంగానే డబ్బులు వసూలు చేస్తున్నాయి.
అధికారులు విఫలం..
ఏటా పెరుగుతున్న ఫీజులను నియంత్రించడంలో సంబంధిత అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కేజీ నుంచి పీజీ వరకు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఫీజుల నియంత్రణపై ప్రభుత్వ పరంగా తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఫీజుల మోత..
ప్రైవేటు పాఠశాలల్లో డిటిటల్ క్లాస్‌లు, ఆటల పోటీలు, డ్యాన్స్‌లు, తరగతి గదుల్లో కంప్యూటర్ విద్య, సైన్స్ ల్యాబ్, లైబ్రరీలు, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ అంటూ ప్రచారాలు నిర్వహించి విద్యార్థుల తల్లిదండ్రులను ఆకట్టుకుంటున్నారు. ఆ తర్వాత విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు ఇలా ఉన్నాయి.
ఎల్కేజీ నుంచి 5వతరగతి వరకు : రూ.50వేల నుంచి రూ.లక్ష
రవాణా చార్జీల పేరుతో : రూ.15వేల నుంచి రూ.20వేలు
పాఠ్యపుస్తకాలు, నోటుబుక్స్కు : రూ.10వేల నుంచి రూ.20వేలు
డ్రస్, టై, బెల్టులకు : రూ.5వేల నుంచి రూ.8వేలు
5వ తరగతి నుంచి 10తరగతి వరకు : రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు
డొనేషన్ల పేరుతో : రూ.లక్షల్లో వసూలు
ప్రైవేటులో ఫీజులను నియంత్రించాలి
ప్రైవేటు పాఠశాలల్లో పెద్ద ఎత్తున ఫీజులు, డొనేషన్లు వసూలు చే స్తుండడంతో సామాన్యులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకరిని చూసీ ఒకరు తమ పిల్లల ను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. తమ పిల్లల కోసం అప్పులు చేసి ప్రైవేటు పాఠశాలలకు అడిగినంత ఫీజులను చెల్లిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను నియంత్రించాలి. డొనేషన్లు తగ్గించేలా చర్యలు తీసుకోవాలి.
– నిట్టు జగదీశ్వర్, విద్యార్థి నాయకుడు
ఫీజుల మోతపై చర్యలేవి?
ఏటా ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల మోత మోగుతున్నది. కళాశాలల్లో ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. వీటిని నియత్రించాల్సిన ఉన్నతస్థా యి అధికారులు, ప్రభుత్వం మా త్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఫీజుల మో త మోగిస్తున్న ప్రైవేటు పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలి.
– మొగిలి వెంకటేశ్, ఇబ్రహీంపట్నం