వికారాబాద్, నవంబర్ 30 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ప్రతి నెలా ఆసరా పింఛన్లు సకాలంలో రాక తాము భిక్షాటన చేయాల్సిన పరిస్థితి దాపురించిందని భారత దివ్యాంగుల హక్కుల పరి రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేశ్ మండిపడ్డారు. శనివారం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనను నిరసిస్తూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ నియోజకవర్గం వికారాబాద్‌లోని రైల్వే జంక్షన్లో సంఘం నేతలతో కలిసి వినూత్న రీతిలో భిక్షాటన చేసి పాలన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి ఐదో తేదీలోపే ఆసరా పింఛన్లు పంపిణీ చేయడంతో పాటు రాష్ట్రంలో ఏడాది నుంచి కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వివిధ రకాల పింఛన్‌దారులకు పింఛన్లను మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
లేనిచో త్వరలోనే తమ సంఘం ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యుంటే తమ సమస్యలు పరిష్కారమయ్యేవని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దివ్యాంగులను పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పోతురాజు సుధీర్, సంఘం జిల్లా నాయకులు రవీందర్, ధారూరు, వికారాబాద్ టౌన్, పరిగి, దోమ మండలాల అధ్యక్షులు బాలరాజు, గణేశ్, చంద్రయ్య, సుక్కయ్య, నాయకులు అనిల్, నరసింహులు, నారాయణ, నరేశ్, జంగయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.