కులకచర్ల, మార్చి 15 : ఇటుక బట్టీలకు అటవీ కలపను అక్రమంగా వినియోగిస్తూ కొందరు అడవులను నాశనం చేస్తున్నారు. మండలంలోని చా లా గ్రామాల్లో అడవులున్నాయి. వాటి సంరక్షణ కు ప్రతి సెక్షన్‌కు ఒక అటవీశాఖ అధికారిని ప్రభు త్వం నియమించింది. అలాగే పలు గ్రామాల్లో వనసేవలకులనూ నియమించారు. అయినా కొం దరు అడవుల్లోని కలపను విచ్చలవిడిగా నరుకుతూ గుట్టుచప్పుడు కాకుండా ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. రాత్రి సమయాల్లో ఈ తంతు యథేచ్ఛగా సాగుతుంటే అటవీశాఖ అధికారులు మాత్రం మొద్దు నిద్రలో ఉంటున్నారని.. ఇటుక బట్టీల వ్యాపారులు ఇచ్చే డబ్బులకు ఆశపడి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.
గతంలో అడవిలో నుంచి ఒక్క కట్టెను కొట్టినా వనసంరక్షణ సమితి ఆధ్వర్యంలో వారికి జరిమానాలు విధించేవారు. అయితే, వనసంరక్షణ సమితిలు రద్దు కావడంతో అడవుల పూర్తి బాధ్యత ను ప్రభుత్వం అటవీశాఖ అధికారులకు అప్పగించింది. అప్పటి నుంచి అడవుల నుంచి కలపను ఇటుకబట్టీల వ్యాపారు లు, ఇతర కట్టెల వ్యాపారులు యథేచ్ఛగా నరికి తరలిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోకుంటే రానున్న రోజుల్లో అడవులు పూర్తి స్థాయిలో అంతరించిపోయే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. అదేవిధంగా ఇటుక బట్టీలకు విద్యుత్తు కనెక్షన్లను అక్రమంగా తీసుకుంటూ వాటి నిర్వాహకులు విద్యు త్తు చౌర్యానికి పాల్పడుతున్నారు. ఇటుకల తయారీకి మట్టిని ప్రతి ఏ టా తీస్తుండడంతో రానురాను భూసారం తగ్గిపోతున్నది. దీంతో ఆ పొలాల్లో భూసారం క్షీణించి పంటలు పండే అవకాశం లేకుండా పోతున్నది. అలాగే గ్రామాల్లో ఎలాంటి అనుమతుల్లేకుండానే ఇటుకబట్టీలను ఏర్పాటు చేస్తున్నారు.
అక్రమంగా విద్యుత్తును వాడితే చర్యలు
ఇటుక బట్టీల వద్ద అనుమతి లేకుండా విద్యుత్తును వాడితే కేసులు నమోదు చేస్తాం. గతంలో పలువురిపై కేసులు నమోదు చేశాం. ఎవ్వరూ ఇటుక బట్టీలకు అక్రమంగా విద్యుత్తును వినియోగించరాదు.
-హైమద్, విద్యుత్తు శాఖ ఏఈ, కులకచర్ల
కలపను ఇటుకబట్టీలకు వాడొద్దు
మండలంలోని అడవుల నుంచి కలపను నరికి అక్రమం గా ఇటుక బట్టీలకు తరలిస్తే వారిపై అటవీశాఖ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తాం. ఇటుకబట్టీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ కలపను వాడకూడదు. అడవుల సంరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత, అతిక్రమిస్తే చర్యలు తప్పవు.
-సాయికుమార్, ఫారెస్ట్ అధికారి, కులకచర్ల
పర్మిషన్ లేకుండా కలపను నరకొద్దు
పట్టా భూములు, ఇతర భూముల్లో ఉన్న కలపను అనుమతి లేకుండా నరికి ఇటుకబట్టీలకు వినియోగిస్తే చర్యలు తీసుకుంటాం. పట్టాభూము ల్లోని కలపను నరకాలన్నా తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సిందే. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవు.
-మురళీధర్, తహసీల్దార్ కులకచర్ల