న్యూఢిల్లీ, మార్చి 2 : విదేశాల్లో చదువుకుంటున్న మొత్తం భారతీయ విద్యార్థుల్లో పావు వంతు మంది గల్ఫ్ దేశాల్లోనే ఉన్నారు. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్న దరిమిలా ఈ విద్యార్థుల చదువులకు ఆటంకం ఏర్పడే అవకాశమే గాకుండా వారంతా భద్రతాపరమైన ముప్పును కూడా ఎదుర్కొంటున్నారు. 2025 నాటి లెక్కల ప్రకారం 150 దేశాల వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, స్కూళ్లలో 18.80 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. పశ్చిమాసియాలో పావు వంతుమంది అంటే దాదాపు 5 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. 90 లక్షల మంది భారతీయులు నివసిస్తున్న ఈ ప్రాంతంలో అనేక స్కూళ్లు భారతీయులకు అనుగుణంగా ఉండే సిలబస్‌నే బోధించడంతో భారతీయ విద్యార్థులు ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం అత్యధికంగా 2,53,832 మంది భారతీయ విద్యార్థులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో చదువుకుంటుండగా, తర్వాత స్థానాల్లో వరుసగా సౌదీ అరేబియా(75,830), కువైట్(50,000), ఖతార్(49,346), ఒమన్ (44,847) ఉన్నాయి. బహ్రెయిన్ (28,620), ఇజ్రాయెల్(900)ని కూడా కలుపుకొంటే ప్రస్తుత యుద్ధానికి ప్రభావితమైన దేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థుల సంఖ్య దాదాపు 5 లక్షల వరకు ఉండవచ్చని తెలుస్తున్నది. వీరుగాక ఉద్యోగ నిమిత్తం గల్ఫ్ దేశాలకు వచ్చి స్థిరపడిన భారతీయుల సంఖ్య అదనం. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో మార్చి 2న పశ్చిమాసియాలో జరుగవలసి ఉన్న 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలను సీబీఎస్ఈ వాయిదావేసింది.