Road Accident | యాచారం : యాచారం మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు గిరిజన యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన యాచారం మండల కేంద్రంలోని తిరుమలేశుని గుట్ట సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి నాగార్జునసాగర్-హైదరాబాద్ ప్రధాన రహదారిపై చోటు చేసుకున్నది.
సిఐ నందీశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా మల్లేపల్లి మండలం దంజిలాల్ తండాకు చెందిన రామావత్ అరుణ్ నాయక్, రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం పల్లె చెల్కతండాకు చెందిన విస్లావత్ అశోక్ నాయక్‌లు బుల్లెట్ వాహనంపై హైదరాబాద్ నుంచి మాల్ వైపు వస్తున్నారు. సరిగ్గా యాచారం మండల కేంద్రంలోని తిరుమలేశ్ని గుట్ట సమీపంలోకి రాగానే గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టడంతో ఇరువురికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ప్రమాదంలో బుల్లెట్ వాహనం నుజ్జునుజ్జయింది. ప్రమాదానికి కారణమైన గుర్తుతెలియని వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు సిసి టీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.