శేరిలింగంపల్లి, జూన్ 16: ఆర్థిక లావాదేవీల్లో తేడాలు రావడంతో వరుసకు బావను కిరాయి ముఠాతో కలిసి కిడ్నాప్ చేయించాడు బావమరిది. ఈ కేసు ఛేదించిన గచ్చిబౌలి పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కిడ్నాప్‌నకు పాల్పడిన మరో 10 మంది పరారీలో ఉన్నారు. కలకలం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…కేపీహెచ్‌బీ కాలనీలో నివసించే సత్తనపల్లికి చెందిన చదలవాడ సాయిగుప్తా (35), నిజాంపేటకు చెందిన కర్రె సతీశ్‌రెడ్డి(38) వ్యాపార భాగస్వాములు. చదలవాడ సాయిగుప్తాకు బావమరిది వరుసైన సత్తెనపల్లికి చెందిన భవిశెట్టి గౌతమ్(35) అధిక వడ్డీకి అప్పు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.
ఇచ్చిన అప్పునకు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కిడ్నాప్ చేసి డాక్యుమెంట్లు రాయించుకోవాలని గౌతమ్ భావించాడు. ఈ క్రమంలో అల్విన్‌కాలనీలో నివాసముండే సత్తెనపల్లికి చెందిన అన్నం అశోక్‌రెడ్డిని కలిశాడు. ఇద్దరు కలిసి జగద్గిరిగుట్టకు చెందిన కిరాయి ముఠాతో కిడ్నాప్‌నకు పథకం రచించారు. ఈనెల 14న రాత్రి గచ్చిబౌలిలోని పీఎస్ఆర్ ప్రైమ్ టవర్స్ నుంచి సాయిగుప్తా, సతీష్‌రెడ్డి కారులో ఇంటికి బయలుదేరారు. మరో కారులో గౌతమ్‌తో పాటు మరో 10 మంది వెంబడించారు. హాఫీజ్‌పేట వరకు చేరుకున్న సాయిగుప్తా, సతీష్‌రెడ్డి ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టారు. సాయిగుప్తా, సతీష్‌రెడ్డిలను జగద్గిరిగుట్ట ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతానికి తరలించారు.
అప్పు తీసుకున్నట్లు డాక్యుమెంట్లపై సంతకం చేయాలని ఇద్దరిని చితకబాదారు. అనంతరం అక్కడి నుంచి వారిద్దరిని వికారాబాద్ జిల్లాలోని ఓ వ్యవసాయకేత్రంలోకి తీసుకెళ్లి తీవ్రంగా హింసించారు. సాయిగుప్తా భార్యకు ఫోన్‌చేసి డబ్బులు డిమాండ్ చేశారు. సాయిగుప్తా భార్య తులసి శనివారం గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఈ విషయమై ఫిర్యాదు చేసింది. దీంతో నిందితులు వికారాబాద్‌లో ఉన్నట్లు గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు అక్కడకు వెళ్లారు. ఇది గమనించిన దుండగులు సాయిగుప్తా, సతీష్‌రెడ్డిలను అక్కడే వదిలి అక్కడి నుంచి పరారయ్యారు. ప్రధాన నిందితులైన గౌతమ్, అశోక్‌రెడ్డిలను పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. మరో 10 మంది దుండగులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.