తుర్కయంజాల్, మార్చి 23: తుర్కయంజాల్ మున్సిపాలిటిలో ఎక్కడబడితే అక్కడ మ్యాన్‌హోల్స్ నోళ్లు తెరచుకున్నాయి. నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో మ్యాన్ హోల్స్ పై కప్పులు అనేక ప్రాంతాల్లో ధ్వంసంమయ్యాయి.
తుర్కయంజాల్ మున్సిపల్ కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారిలో మ్యాన్ హోల్ ధ్వంసమై ప్రమాదకరంగా మారింది. మ్యాన్‌హోల్స్ పై కప్పులు లేకపోవడంతో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రధానంగా రాత్రి వేళలో ఆ దారిలో వేళ్లే వారు మ్యాన్‌హోల్ మూత తెరచి ఉండటంతో అందులో పడి గాయాల పాలవుతున్నారని స్థానికులు వాపోతున్నారు. ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నప్పటికీ మున్సిపల్ అధికారులు మాత్రం తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
తుర్కయంజాల్ మున్సిపాలిటీలో ఇంజనీరింగ్ విభాగం అధికారుల నిర్లక్ష్యంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేక చాలాచోట్ల మ్యాన్ హోల్స్ ద్వారా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ ఉన్నతాధికారులు స్పందించి మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.