వికారాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం మెగా ఆయిల్‌పామ్ ప్లాంటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ ప్రోగ్రాం ప్రారంభం కాక ముందే వేదికపై ఎవరు ఉండాలనే విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య గొడవ జరిగి బూతులు తిట్టుకునే వరకు చేరింది. ఈ వివాదంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులు కలిసిమెలిసి ఉండాలని, వివాదాలను పక్కన పెట్టి సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ఆయిల్‌పామ్ మొక్కలను సాగు చేస్తే అన్నదాతకు ఆర్థికంగా లాభదాయంగా ఉంటుందని.. ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా ఆదుకుంటుందని, సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తుందని మంత్రి తుమ్మల అన్నదాతలకు సూచించారు.
వికారాబాద్, జూలై 29 : ఆయిల్‌పామ్ పంటను సాగు చేస్తూ ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు. మంగళవారం కొత్రేపల్లిలోని కాసాని జ్ఞానేశ్వర్ వ్యవసాయ క్షేత్రంలో చేపట్టిన మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ డ్రైవ్‌లో భాగంగా శాసనసభ స్పీకర్‌తో కలిసి ఆయన మొక్కను నాటి మాట్లాడారు. రాష్ట్ర ప్రభు త్వం ఆయిల్‌పామ్ పంటకు సబ్సిడీ ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తున్నదన్నారు. జిల్లాలో పెద్ద మొత్తంలో ఈ పంటను సాగు చేసినైట్లెతే రైతులకు అందుబాటులో ఉండేలా ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకుందామని మంత్రి తుమ్మల ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అనంతరం శాసనసభ స్పీకర్ ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ ఆయిల్‌పామ్ తోటల పెంపకానికి రైతులు ముందుకొస్తే ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా రానున్న ఐదేండ్ల కాలంలో మన ప్రాంతానికి సాగు నీటిని తీసుకొస్తానన్నారు. కార్యక్రమంలో కాసాని జ్ఞానేశ్వర్, పట్టు పరిశ్రమల శాఖ డైరెక్టర్ హస్మిన్ భాష, డిప్యూటీ డైరెక్టర్ నీరజాగాంధీ, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి సత్తార్, వ్యవసాయ శాఖ అధికారి రాజారత్నం, ఆర్డీవో వాసుచంద్ర, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎదుటే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల మధ్య గొడవ జరిగింది. మంగళవారం కొత్రేపల్లి సమీపంలో కాసాని జ్ఞానేశ్వర్ వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్‌పామ్ మొక్కలను నాటేందుకు మంత్రి తుమ్మల, స్పీకర్ ప్రసాద్‌కుమార్ తదితరులు హాజరయ్యారు. సమావేశం ప్రారంభానికి ముందు.. వేదికపైకి నాయకులను ఓ వ్యక్తి పిలుస్తున్నాడు. అతడి వద్దకు వెళ్లిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్‌కుమార్ మరి కొంతమంది నాయకులను పిలవాలని చెప్పగా.. అక్కడే ఉన్న కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి నీదేంది పెత్తనం అంటూ అతడిపై మండిపడ్డాడు. నీవు ఎంత అంటే నీవెంతా అనుకుంటూ ఇరువురు బూతుల పర్వం మొదలెట్టారు. ఇరువురి మధ్య చిన్న పాటి ఘర్షణ జరిగింది. దీంతో నాయకులు, పోలీసులు సర్ది చేయడంతో వారు శాంతించారు. వీరి మధ్య గొడవలు కొంతకాలంగా జరుగుతున్నట్లు సమాచారం.