ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 10 : కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్ల కొనుగోలుపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. వడ్లు కొనుగోలు చేయాలని మండలాలు, నియోజకవర్గాల్లో ధర్నాలు, రాస్తారోకోలు చేసినా కేంద్ర సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆందోళనలు ఉధృతమవుతున్నా పట్టించుకోకపోవడంతో కేంద్రంతో తాడో…పేడో తేల్చుకునేందుకు గులాబీ దళం నేడు ఢిల్లీని వేదికగా చేసుకున్నది. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఢిల్లీలో చేపట్టనున్న నిరసన దీక్షకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్, జడ్పీ చైర్మన్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లతో పాటు టీఆర్ఎస్ శ్రేణులు ఢిల్లీ బాట పట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వడ్ల సెగ తాకేలా తెలంగాణ సత్తాను చాటేలా కార్యాచరణ రూపొందించారు. సీఎం కేసీఆర్ సూచనతో వరి సాగు విస్తీర్ణం తగ్గినా, బీజేపీ నేతల ఉచిత హామీతో వరి వేసిన రైతులు నష్టపోయే స్థితి నెలకొన్నది. రైతుల శ్రేయస్సే ధ్యేయంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర సర్కార్ కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనేవరకు పోరాడేందుకు పట్టుదలగా ఉన్నది.
యాసంగి వడ్ల కొనుగోలుపై టీఆర్ఎస్ పోరాటం ఉధృతమైంది. ఇప్పటివరకు రాష్ట్రానికే పరిమితమైన ఉద్యమం సోమవారం ఢిల్లీకి తాకనున్నది. కేంద్రంతో తాడో.. పేడో తేల్చుకోవడానికి ఢిల్లీని వేదికగా చేసుకున్నది. కేంద్రం వడ్లు కొనుగోలు చేయాలంటూ ఈ నెల 6 నుంచి రాష్ట్రంలో టీఆర్ఎస్పార్టీ పలు దఫాలుగా ఆందోళనలు చేపట్టింది. సోమవారం ఢిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ పార్టీ యంత్రాంగాన్ని నడిపిస్తున్నారు.
తొలి దశలో నియోజకవర్గాలవారీగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు ఏర్పాటుచేసి ఉద్యమ ఆవశ్యకతను వివరించారు. ఈ నెల 4న అన్ని మండలాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టి, రైతులతో కలిసి పెద్దఎత్తున నిరసన దీక్షలు నిర్వహించారు. 6న జిల్లా మీదుగా వెళ్లే అన్ని జాతీయ రహదారులను దిగ్బంధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడే రైతులతో కలిసి పార్టీ శ్రేణులు బైఠాయించారు. 7న రంగారెడ్డి జిల్లాలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ పెద్దఎత్తున ఉద్యమాలు చేపట్టారు. 8న గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని చోట్ల నల్లజెండాలు ఎగురవేసి క్షేత్రస్థాయి వరకు ఆందోళనను ఉధృతంగా తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర బీజేపీ నేతల తీరును ప్రజలకు వివరిస్తూ నల్లబ్యాడ్జీలు, జెండాలతో ర్యాలీలు నిర్వహించారు. ప్రధాని దిష్టిబొమ్మలను దహనం చేశారు. జిల్లాలో ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి సారథ్యంలో జిల్లా పార్టీ శ్రేణులంతా ముందుండి నడిపించారు. అంతిమంగా కేంద్రంపై పోరాటానికి ఢిల్లీని వేదికగా చేసుకున్నారు.
ఢిల్లీ బాట పట్టిన ముఖ్య నేతలు
రంగారెడ్డి జిల్లా నుంచి ఢిల్లీలో జరిగే దీక్షకు మంత్రి సబితారెడ్డి, జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు యాదయ్య, జైపాల్యాదవ్తోపాటు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, రైతు బంధు సమితి అధ్యక్షులు, సభ్యులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివెళ్లారు.
గల్లీ నుంచి ఢిల్లీకి..
పరిగి, ఏప్రిల్ 10 : రాష్ట్రంలో యాసంగిలో రైతులు పండించిన వడ్లు కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో గల్లీ నుంచి ప్రారంభించిన పోరు ఢిల్లీకి చేరుకుంది. ఉద్యమం ద్వారా తెలంగాణ సాధించిన పార్టీ టీఆర్ఎస్ రైతులకు న్యాయం కోసం మరో ఉద్యమానికి పూనుకుంది. నాడు ఆత్మగౌరవం నినాదంగా ఉద్యమం కొనసాగగా.. నేడు అందరికీ అన్నం పెట్టే రైతాంగాన్ని కాపాడుకునేందుకు టీఆర్ఎస్ ఉద్యమబాట పట్టింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఇప్పటికే గ్రామ స్థాయి నుంచి వివిధ స్థాయిల్లో నిరసన దీక్షలు చేపట్టారు.
కేంద్రం బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయబోమని చెప్పడంతో యాసంగి సీజన్ ప్రారంభంలో రైతులు వరి వేయరాదని, రైస్‌మిల్లులతో ఒప్పందం చేసుకున్నవాళ్లు వేసుకుంటే మాకు అభ్యంతరం లేదని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. అప్పట్లో రైతులను రెచ్చగొట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. మీరు వరి వేయండి, కేంద్రంతో మాట్లాడి మేము కొనుగోలు చేయిస్తామని గప్పాలు కొట్టారు. సీఎం కేసీఆర్ సూచనతో వరి సాగు విస్తీర్ణం తగ్గినా, బీజేపీ నేతల ఉచిత హామీతో వరి వేసిన రైతులు నష్టపోయే స్థితి నెలకొంది.
బీజేపీ నాయకుల బండారాన్ని ఎక్కడికక్కడ కడిగి పారేయడానికి, వడ్లు కొనుగోలు చేయించేందుకు టీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నది. యాసంగిలో రైతులు పండించిన వడ్లు కేంద్రం కొనుగోలు చేయాలంటూ ఈ నెల 4న వికారాబాద్ జిల్లా పరిధిలోని అన్ని మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ శ్రేణులు రైతులతో కలిసి నిరసన దీక్షలు చేపట్టగా, 7న వికారాబాద్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రజా ప్రతినిధులు, రైతులు మహాధర్నా నిర్వహించారు.
8న జిలాలలోని ప్రతి గ్రామంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనంతోపాటు ప్రతి రైతు తమ ఇంటిపై నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఇక వరి పోరు ఢిల్లీకి చేరుకుంది. ఢిల్లీలో జరిగే నిరసన దీక్షలో పాల్గొనేందుకు వికారాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఎమ్మెల్యేలు కొప్పుల మహేశ్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, పైలెట్ రోహిత్‌రెడ్డి, పార్టీకి చెందిన పలువురు నాయకులు సైతం ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో జరిగే నిరసనదీక్షలో వారు పాల్గొని రైతుల పక్షాన పోరాడనున్నారు. కేంద్రం మెడలు వంచి వడ్లు కొనుగోలు చేయించేందుకు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన దీక్ష కొనసాగుతుంది.
ఢిల్లీలో తెలంగాణ సత్తా చాటుతాం
– మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే
యాసంగి వడ్ల కొనుగోలు కోసం నేడు ఢిల్లీలో నిర్వహించే ధర్నాలో తెలంగాణ సత్తా చాటుతాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో పండించిన ధాన్యం కొనుగోలు చేసేంత వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. పార్టీ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ధర్నా కార్యక్రమానికి జిల్లా నుంచి టీఆర్ఎస్ శ్రేణులను పెద్దఎత్తున తరలించాం.