సమైక్య పాలనలో నిరాదరణకు గురై మౌలిక సదుపాయాలకు దూరంగా దుర్భర జీవితాన్ని గడిపిన గిరిజనం.. నేడు స్వరాష్ట్రంలో సకల సౌకర్యాలతో దర్జాగా బతుకుతున్నారు. సీఎం కేసీఆర్ పకడ్బందీగా ప్రణాళికలను అమలు చేసి గిరిజనుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. స్వయం పాలనే ధ్యేయంగా తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో 60 తండాలు, వికారాబాద్ జిల్లాలో 84 తండాలను ప్రత్యేక జీపీలుగా ఏర్పాటు చేశారు. పాత గ్రామ పంచాయతీలకు దీటుగా మౌలిక వసతులు కల్పించి ఎన్నో ఏండ్ల గిరిజనుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపారు. ఫలితంగా ఒకప్పుడు చెలిమ, చేద బావి నీళ్లే దిక్కైన గిరిజన ఆవాసాలకు నేడు స్వచ్ఛమైన మిషన్ భగీరథ నీరు అందుతున్నది. మట్టి దారులు పోయి బీటీ రోడ్లు వచ్చాయి.
వీధుల్లో చెత్త, మురుగుకు బదులు పచ్చదనం, పరిశుభ్రత దర్శనమిస్తున్నది. గతంలో ఎక్కడికెళ్లాలన్నా కాలినడకే శరణ్యమైతే.. ఇప్పుడు మారుమూల తండాలకు సైతం ఆర్టీసీ సేవలు అందుతున్నాయి. ఇవేకాకుండా విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో గిరిజనులకు అధిక ప్రాధాన్యమిస్తూ వారిని ప్రభుత్వం అన్ని రంగాల్లో బలోపేతం చేస్తున్నది. త్వరలోనే అర్హులైన గిరిజనులకు పోడు భూముల పట్టాలిచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. అలాగే 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 10 శాతానికి రిజర్వేషన్ల పెంపు, ప్రత్యేక భవన్లు, విదేశీ చదువులకు రూ.20 లక్షల ఆర్థిక సాయం వంటి పథకాలతో గిరిజనులకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నది. కాగా, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా నేడు ‘గిరిజన దినోత్సవం’ నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లా ముస్తాబైంది.
Cmkcr
రంగారెడ్డి, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : ఉద్యమ సమయం లో గిరిజనుల కష్టాలను స్వయంగా చూసిన సీఎం కేసీఆర్ స్వరాష్ట్రంలో వారి కలలను నిజం చేస్తున్నారు. జీవిత చరమాంకంలో అష్టకష్టాలు పడ్డ వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. గిరిజన పిల్లల కోసం గురుకుల విద్యను అందుబాటులోకి తెచ్చి కార్పొరేట్ స్థాయిలో విద్యావకాశాలు కల్పిస్తున్నారు. విద్యా, ఉద్యోగ, ఉపాధిపరంగా యువత భవితకు భరోసా కల్పిస్తున్నారు. పోడు భూములకు హక్కులు, కల్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాలతో అభయహస్తం అందిస్తున్నారు. తండాలను పంచాయతీలుగా చేసి పాలనలో వారికి ప్రాధాన్యం కల్పించారు. స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచి ముడుపూటలా తిండికి కష్టమైన తమ జీవితాలు తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త ఆదాయ మార్గాలతో మలు పు తిరిగాయని రంగారెడ్డి జిల్లాలోని అనేక గిరిజన కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
సబ్బండ వర్ణాల సంక్షేమమే లక్ష్యంగా..
స్వరాష్ట్రంలో సబ్బండ వర్ణాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సీఎం కేసీఆర్ గిరిజనులు సమాజంలో తలెత్తుకుని బతికేలా వారికి పాలనలో ప్రాధాన్యం కల్పించారు. 75 ఏండ్ల స్వాతంత్య్ర దేశంలో అమలుకు నోచుకోని తండాలను గ్రామపంచాయతీలుగా మార్చాలన్న ప్రధాన డిమాండ్‌ను సీఎం కేసీఆర్ చేసి చూపించారు. జిల్లాలోని 60 తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి చరిత్రలో నిలిచిపోయారు. ఫలితంగా నేడు జిల్లాలోని అనేక తండాలు అభివృద్ధిలో ముందు వరుసలో నిలిచా యి. సంత్ సేవాలాల్ జయంతి వంటి కార్యక్రమాలను నిర్వహి స్తూ గిరిజన సంస్కృతిని భవిష్యత్ తరాలకు తెలిసేలా ప్రభుత్వం కృషి చేస్తున్నది. పోడు భూములకు హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండటంతో గిరిజనులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
విద్యాభివృద్ధికి చేయూత
గిరిజన విద్యార్థుల కోసం గురుకులాలను ఏర్పాటు చేసి వారి విద్యాభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. వాటితోపాటు మూడు ఆశ్రమ పాఠశాలలు, నాలుగు వసతి గృహాలు, ఏడు కళాశాల వసతి గృహాలను ఏర్పాటు చేసింది. తండాల్లోని 197 ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థులకు బోధన జరుగుతున్నది. పోస్ట్‌మెట్రిక్ ఉపకార వేతనాల కింద గత తొమ్మిదేండ్లలో లక్షకు పైగా విద్యార్థులకు రూ.8.55 కోట్ల ఉపకార వేతనాలను అందించింది. ఫీజురీయింబర్స్ మెంట్ కింద రూ. 41. 25 కోట్లను, గిరిజన ట్రైనీ న్యాయవాదులకు ఒక్కొక్కరికీ నెలకు రూ.7వేల చొప్పున ప్రోత్సాహకంగా అందిస్తున్నది. గిరిజనుల రిజర్వేషన్‌ను ఆరు నుంచి పది శాతానికి పెంచడంతో ఎస్టీలకు ఉద్యోగాల్లోనూ అవకాశాలు పెరిగాయి. గిరిజన అభివృద్ధి(ట్రై కార్ ) సంస్థ ద్వారా తొమ్మిదేండ్లలో 1,604 మందికి రూ.18 కోట్ల సబ్సిడీ రుణాలు, రూ.8.69 కోట్ల బ్యాంకు రుణాలను ప్రభుత్వం అందించింది. గుడుంబా తయారీని మానేసిన వారికి పునరావాస పథకం కింద రూ.148 మం దికి రూ.2.96 కోట్లను అందించి ఆర్థిక తోడ్పాటునందించింది. ఎస్టీలు వాణిజ్య పరంగానూ రాణించేందుకు రూ.1.23కోట్లతో 43 మందికి వాహనాలను అందించింది. పారిశ్రామిక వేత్తలు రాణించేందుకు తోడ్పాటునందించి గిరిజనుల జీవితాల్లో కొత్త వెలుగులను నింపుతున్నది.
కొండ ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు..
వెళ్లేందుకు దారి లేక..తాగేందుకు నీటి బొట్టు కూడా దొరకని తండాలు జిల్లాలో కోకొల్లలు. మౌలిక వసతుల్లేక దుర్భర జీవితాన్ని గడిపిన గిరిజనులకు స్వరాష్ట్రంలో సమస్యల నుంచి విముక్తి లభించింది. ప్రత్యేక ప్రణాళికలను అమలు చేసి గిరిజనుల సమగ్ర వికాసానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. గిరిజన ఆవాసాలకు కూడా మిషన్ భగీరథ పథకంతో ఏండ్లనాటి తాగునీటి కష్టాలను దూరం చేసింది. నీళ్లే కాదు.. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలన్నీ కొండకోనల్లో జీవిస్తున్న గిరిజనులందరికీ అందుతున్నాయి. తండాలకు బీటీ రోడ్లు సమకూరాయి. ఆర్టీసీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్లు, గిరివికాసం, రేషన్ సరుకులు, పింఛన్ వంటి పలు పథకాలూ అందుతున్నాయి. కల్యాణలక్ష్మి పథకం కింద తొమ్మిదేండ్లలో 4,699 మందికి రూ. 45.51కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించింది. 2021-22లోనే 991 మంది గిరిజన యువతులకు కల్యాణలక్ష్మి ద్వారా పెండ్లి కానుకను అందించింది. ఒకప్పుడు తండాల్లోనే కాన్పులు జరిగేవని.. ఇప్పుడు మా త్రం 108కు ఫోన్ చేసి ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీలు చేయించుకుంటున్నామని తండాలకు చెందిన పలువురు గిరిజన మహిళలు చెబుతున్నారు.