రంగారెడ్డి, ఫిబ్రవరి 8(నమస్తే తెలంగాణ): ఓటరు తుది జాబితా గురువారం విడుదలైంది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం విడుదల చేసింది. దాని ప్రకారం రంగారెడ్డి జిల్లా మొత్తం ఓటర్లు 35,91,120 మంది ఉండగా.. అందులో పురుషులు 18,50,292 మంది, స్త్రీలు 17,40,379 మంది,ఇతరులు 449 మంది, ఎన్ఆర్ఐ ఓటర్లు 286 మంది, సర్వీస్ ఓటర్లు 581 మంది ఉన్నారు. అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో మొత్తం ఓటర్లు 9,84,068 మంది ఉండగా .. పురుషులు-4,86,109 మంది, మహిళలు-4,97,920 మంది, ఇతరులు 39 మంది ఓటర్లు ఉన్నారు. అయితే జిల్లాలో మహిళా ఓటర్లే అధికంగా ఉండడం గమనార్హం. పరిగి నియో జకవర్గం మినహా వికారాబాద్, తాండూరు, కొడంగల్ నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు.
పరిగి నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లుండగా.. వికారాబాద్ నియో జకవర్గంలో అత్యల్పంగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే జిల్లాలో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. ఓటరు ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలో 9,71,011 మంది ఓటర్లుండగా, తుది జాబితా ప్రకారం 9,84,068 మంది ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు నవంబర్ 10న ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితా ప్రకారం రంగారెడ్డి జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 35,23,219గా ఉన్నది. తాజాగా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మళ్లీ ఎన్నికల సంఘం ఓటు నమోదుకు అవకాశం కల్పించగా.. కొత్తగా 68,768 మంది ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నారు. ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం ఓటర్లు 35,57,415 ఉండగా.. అందులో పురుషులు 18,39,207 మంది, మహిళలు 17,17,763 మంది, ఇతరులు-445 మంది ఉన్నారు.
రంగారెడ్డి జిల్లాలో ఓటర్ల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత చాలా మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. గత నెల 8న ముసాయిదా జాబితాను ప్రచురించగా ..గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరుగని ప్రక్షాళన ఈ విడుతలో చేపట్టారు. ఒకే రకంగా ఉన్న రెండు ఫొటోలు, ఒకే పోలికతో ఉన్న ఇద్దరు వ్యక్తులు, ఒకే చిరునామా..ఇలా సాఫ్ట్‌వేర్‌తో తప్పిదాల ను గుర్తించి తొలగించారు. గత అసెంబ్లీలో ఉన్న ఓటరు జాబితాతో పోలిస్తే ప్రస్తుత జాబితాలో 68,768 మంది ఓటర్లు పెరిగారు.
అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే వికారాబాద్ జిల్లాలో 23,692 మంది ఓటర్లు పెరిగారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 9,60,376 మంది ఓటర్లుండగా, ప్రస్తుతం జిల్లాలో ఓటర్ల సంఖ్య 9,84,068 మంది ఓటర్లకు చేరింది. అదేవిధంగా ఓటరు ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలో 9,71,011 మంది ఓటర్లుండగా, తుది జాబితా ప్రకారం జిల్లాలో 13,057 మంది ఓటర్లు పెరిగారు. ముసాయిదా జాబితా అనంతరం పెరిగిన ఓటర్లలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు.
ముసాయిదా జాబితాతో పోలిస్తే పరిగి నియోజకవర్గంలో 3902 మంది ఓటర్లు, వికారాబాద్‌లో 1574 మంది, తాండూరు లో 4198 మంది, కొడంగల్ నియోజకవర్గంలో 3390 మంది ఓటర్లు పెరిగారు. పెరిగిన ఓటర్లలో మహిళా ఓటర్లకు సంబంధించి పరిగి నియోజకవర్గంలో 2783 మంది, వికారాబాద్ నియో జకవర్గంలో 1328 మంది, తాండూరు నియోజకవర్గంలో 2818 మంది , కొడంగల్ నియోజకవర్గంలో 2550 మంది ఓటర్లు పెరిగారు.
ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా తుది ఓటరు జాబితాను విడుదల చేశాం. ఎస్ఎస్ఆర్-2024 కార్యక్రమంలో భాగంగా జనవరి 22 వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తుది ఓటరు జాబితాను రూపొందించాం. ఈ జాబితాను అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలోని బూత్ లెవల్ అధికారులు, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించే తహసీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచుతాం.
-శశాంక, జిల్లా ఎన్నికల అధికారి, రంగారెడ్డి కలెక్టర్