బొంరాస్పేట, జూలై 19 : కడుపులో నులి పురుగులతో పిల్లలు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. వారి శారీరక, మానసిక ఎదుగులపై నులి పురుగులు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఈ నేపథ్యంలో నులి పురుగులను నిర్మూలించడమే లక్ష్యంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఏటా ఆగస్టు 10న జాతీయ నులి పురుగుల నివారణ దినంగా పాటిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని 20 మండలాల్లో 1 నుంచి 19 సంవత్సరాలలోపు ఉండే చిన్నారులు, యువతకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, కళాశాలల్లో ఉండే విద్యార్థులకు మాత్రలు పంపిణీ చేస్తారు. ఆగస్టు 20న తీసుకోనివారికి 27న మాప్అప్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరిగి మాత్రలు అందజేస్తారు. నులి పురుగుల నివారణకు మాత్రల పంపిణీపై వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. మాత్రలు, ప్రచార సామగ్రిని ఆరోగ్య ఉప కేంద్రాలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలకు అందజేశారు.
నులి పురుగులు వ్యాపించే విధానం
నులి పురుగులు అనేవి మనిషి ప్రేగుల నుంచి పోషకాలను గ్రహించి అభివృద్ధిచెందే పరాన్న జీవులు. పిల్లలు ఆరు బయట చెప్పులు వేసుకోకుండా ఆడుకోవడం, చేతులు కడుక్కోకుండా తినడం, బహిరంగ మలవిసర్జన చేయడం, అపరిశుభ్ర పరిసరాల వల్ల నులిపురుగులు పిల్లల్లోకి ప్రవేశిస్తాయి. పిల్లల్లో సాధారణంగా ఏలిక పాములు, నులి పురుగులు, కొంకి పురుగులు కనపడుతాయి. వీటినే మనం వాడుక భాషలో నట్టలు అని కూడా అంటాం.
నులి పురుగుల సంక్రమణం వల్ల కనిపించే లక్షణాలు, వాటి ప్రభావం
పిల్లల్లో నులి పురుగులు ప్రవేశించిన తరువాత రక్త హీనత, పోషకాల లోపం, ఆకలి లేకపోవుట, బలహీనత, ఆందోళన, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం, అలసట వంటి లక్షణాలు కనబడుతాయి. పిల్లల్లో ఇవి తక్కువగా ఉంటే సాధారణంగా వ్యాధి లక్షణాలు కనిపించవు. నులి పురుగుల సంక్రమణ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటే అన్ని ఎక్కువ వ్యాధి లక్షణాలు కనబడుతాయి. శారీరక, మానసిక అభివృద్ధిలో మందకొడిగా కనిపిస్తారు.
వ్యాప్తిని అరికట్టడం ఇలా..
నులి పురుగుల వ్యాప్తికి కొన్ని జాగ్రతలు తీసుకుంటే సరిపోతుంది. బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయకుండా మరుగుదొడ్డినే ఉపయోగించాలి. భోజనం చేసే ముందు, మరుగుదొడ్డిని ఉపయోగించిన తరువాత(మల విసర్జన తరువాత) చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. కాలికి పాదరక్షలను ధరించాలి. వేలి గోళ్లను చిన్నవిగా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పుడూ పరిశుభ్రమైన నీటినే తాగాలి. తినే ఆహార పదార్థాలపై క్రిములు వాలకుండా ఏదైనా కప్పి ఉంచాలి. పండ్లను తినేముందు, కూరగాయలను వండే ముందు శుభ్రమైన నీటితో కడగాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే సాధ్యమైనంత వరకు నులి పురుగుల వ్యాప్తిని, సంక్రమణాన్ని అరికట్టవచ్చు.
నిర్మూలన వల్ల కలిగే ప్రయోజనాలు
నులి పురుగుల నిర్మూలనతో పిల్లల్లో రక్త హీనతను నియంత్రిస్తుంది. పోషకాహార ఉపయోగాన్ని మెరుగుపరుస్తుంది. పిల్లల్లో ఏకాగ్రత పెరిగి నేర్చుకోగల సామర్థ్యం కలుగుతుంది. ఫలితంగా పిల్లలు పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలకు క్రమం తప్పకుండా వెళ్తారు. యువకుల్లో పని సామర్థ్యాన్ని పెంచుతుంది. సంక్రమణ క్రమాన్ని తుంచేసి సమాజంలో నులి పురుగుల వ్యాప్తిని నిరోధిస్తుంది.
వికారాబాద్ జిల్లాలో 2.19 లక్షల మందికి మాత్రలు ఇవ్వాలన్నది లక్ష్యం నులి పురుగుల నివారణకు వికారాబాద్ జిల్లాలోని 20 మండలాల్లో ఆల్బెండజోల్ మాత్రల పంపిణీకి 2.19 లక్షల మంది పిల్లలు, యువతను గుర్తించారు. 1 నుంచి 2 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారికి సగం మాత్ర, రెండేండ్ల పైబడిన వారు ఒక మాత్ర తీసుకోవాలి. ఇది నమిలి మింగాలి. నమిలి మింగితే ప్రయోజనంగా ఉంటుంది. తిన్న అరగంట తరువాత మాత్రను తీసుకోవాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు తీసుకోరాదు. మామూలు జ్వరం, జలుబు ఉన్నవారు తీసుకోవచ్చు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ చేసిన తరువాత ఎంత మంది పిల్లలకు పంపిణీ చేశామో వాటిని నమోదు చేసేందుకు ప్రత్యేక ఫార్మాట్లను అందజేసింది.
అందరూ మాత్రలు తీసుకోవాలి
– డాక్టర్ పాల్వన్కుమార్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి
జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా నేడు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దీనినందరూ విజయవంతం చేయాలి. 1 నుంచి 19 ఏండ్లలోపు ఉన్నవారు తప్పక మాత్ర వేసుకోవాలి. మాత్రలు వేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్స్స్ ఉండవు. నులి పురుగుల వల్ల పిల్లల్లో ఎదుగుల ఉండదు. పిల్లల్లో నులిపురుగుల వ్యాప్తిని నిరోధించడానికి తల్లిదండ్రులు సహకరించాలి. మాత్రలు అందరూ తీసుకుని ఆరోగ్యంగా ఉండాలి. 20న ఎవరైనా తీసుకోకుంటే వారికి 27న సిబ్బంది ఇంటింటికీ తిరిగి పంపిణీ చేస్తారు.