రంగారెడ్డి, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : ఒకటి నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ ఈ నెల 20న తప్పనిసరిగా నులి పురుగుల నివారణ మాత్రలు వేయించాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురసరించుకుని బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని అదనపు కలెక్టర్ చాంబర్లో కరపత్రాలు, గోడప్రతులను ఆమె ఆవిషరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో అల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
నులి పురుగుల వల్ల పిల్లల్లో ఎదుగుదల లోపించడం, మందబుద్ధి, రక్తహీనత, చదువుపై ఏకాగ్రత కోల్పోవడం వంటి రుగ్మతలకు వారు లోనవుతారన్నారు. దీనిని నివారించేందుకు ప్రభుత్వం ఏటా రెండు పర్యాయాలు నులి పురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేస్తున్నదన్నారు. ఇందులో భాగంగా గురువారం జిల్లావ్యాప్తంగా అన్ని వసతి గృహాలు, విద్యా సంస్థలు, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, కిశోర బాలబాలికల సంఖ్యకు అనుగుణంగా ప్రతి ఒకరికీ అల్బెండజోల్ మాత్రల పంపిణీ జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఏమైనా కారణాల వల్ల మాత్రలు తీసుకోలేకపోయిన వారికి జూన్ 27వ తేదీన అందజేసేలా చర్యలు చేపట్టాలన్నారు.
జిల్లాలో ఒకటి నుంచి 19 సంవత్సరాల వయస్సు కలిగిన 8 లక్షల 9 వేల మంది పిల్లలకు ఆల్బెండజోల్ టాబ్లెట్స్ వేయడానికి 40 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా 1,774 మంది ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బందితో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసినట్లు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆల్బెండజోల్ టాబ్లెట్స్ వేయించేలా అవగాహన కలిగించాలని, గ్రామాల్లో టాం టాం ద్వారా తెలియ చెప్పాలని, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాల్లో వంద శాతం పిల్లలకు టాబ్లెట్స్ వేసేలా కార్యాచరణ ఉండాలని, ఆ రోజు పిల్లలు తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అన్నం తిన్న తర్వాత ఒకటి నుంచి 2 సంవత్సరాల పిల్లలకు సగం టాబ్లెట్ పొడి చేసి, 2 నుంచి 3 సంవత్సరాల పిల్లలకు ఒక టాబ్లెట్ పొడి చేసి 3 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల పిల్లలకు ఒక మాత్ర నమిలి మింగే విధంగా వేయాలని సూచించారు. పిల్లలకు మాత్ర వేయగానే తాగేందుకు తగిన తాగునీరు అందుబాటులో ఉంచాలని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో అన్ని జాగ్రత్తలు తీసుకొని వంద శాతం ఆల్బెండజోల్ మాత్రలు వేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం నూటికి నూరు శాతం విజయవంతమయ్యేలా వైద్య, విద్యాశాఖతో పాటు ఐసీడీఎస్, సంక్షేమ శాఖల అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు.
క్షయ వ్యాధిని నివారించేందుకు వయోజనులకు బీసీజీ వ్యాక్సిన్ వేయడానికి ఇంటింటి సర్వే నిర్వహించాలని వైద్య అధికారులను అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. 18 సంవత్సరాల వయసు పైబడిన వ్యక్తులకు, 60 సంవత్సరాల వయస్సు పైబడిన వృద్ధులకు, పొగ తాగే వారికీ, టీబీ వ్యాధిగ్రస్తులతో సన్నిహిత సంబంధాలు కలిగిన వారికి, గత ఐదు సంవత్సరాల్లో టీబీ వ్యాధి సోకిన చరిత్ర కలిగిన వారికి బీసీజీ వ్యాక్సిన్ ఇవ్వవచ్చని తెలిపారు.
18 సంవత్సరాల వయసుకు తకువ ఉన్న వ్యక్తులకు, కాన్సర్ ఉన్న వ్యక్తులకు, హెచ్ఐవీతో జీవిస్తున్న వారికి, గర్భిణి లేదా బాలింతలకు, గత 3 నెలల కాలంలో రక్త మార్పిడి చేసిన వ్యక్తులకు, అనారోగ్యంతో ఉన్న వారికి బీసీజీ వ్యాక్సిన్ ఇవ్వకూడదని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర రావు, జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, డీపీవో సురేష్ మోహన్, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి పద్మజ రమణ, జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్ రావు, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ స్వర్ణ కుమారి, జిల్లా అధికారులు, డాక్టర్లు పాల్గొన్నారు.